తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iit Bombay: ‘ఐఐటీ బాంబే’లో విద్యార్థి మృతి: కుల వివక్షే కారణమంటూ ఆరోపణలు!

IIT Bombay: ‘ఐఐటీ బాంబే’లో విద్యార్థి మృతి: కుల వివక్షే కారణమంటూ ఆరోపణలు!

13 February 2023, 19:31 IST

google News
    • Student Dies in IIT Bombay: ఐఐటీ బాంబే క్యాంపస్‍లో బీ.టెక్ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే, కుల వివక్షే అతడి మరణానికి దారి తీసిందని క్యాంపస్‍లో కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు.
ఐఐటీ బాంబే క్యాంపస్‍లో బైఠాయించిన విద్యార్థులు (Photo: Twitter/AppscIITb)
ఐఐటీ బాంబే క్యాంపస్‍లో బైఠాయించిన విద్యార్థులు (Photo: Twitter/AppscIITb)

ఐఐటీ బాంబే క్యాంపస్‍లో బైఠాయించిన విద్యార్థులు (Photo: Twitter/AppscIITb)

Student Dies in IIT Bombay: ఐఐటీ బాంబే క్యాంపస్‍లో కలకలం రేగింది. ఓ విద్యార్థి (18).. పోవై (Powai) లోని క్యాంపస్‍లో ఉన్న హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. సూసైడ్ నోట్ ఏమీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆత్మహత్యగానే భావిస్తున్నట్టు తెలిపారు. క్యాంపస్‍లో ఎస్సీ స్టూడెంట్ల పట్ల వివక్ష ఉందని, ఈ విద్యార్థి ఆత్మహత్యకు అదే కారణమని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

మూడు నెలల క్రితమే క్యాంపస్‍కు..

Student Dies in IIT Bombay: ఐఐటీ బాంబే పోవై క్యాంపస్‍లో బీ.టెక్ తొలి సంవత్సరం చదువుతున్న దర్శన్ సొలంకి మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ విద్యార్థి అహ్మదాబాద్ నుంచి వచ్చినట్టు తెలిపారు. మూడు నెలల క్రితమే అతడు ఇక్కడ చేరాడు. శనివారంతో అతడి తొలి సెమిస్టర్ పరీక్షలు కూడా ముగిశాయని పేర్కొన్నారు. చదువుపై ఒత్తిడి వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Student Dies in IIT Bombay: ఈ విషయంపై ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాషిస్ చౌదరీ స్పందించారు. “ఈ మధ్యాహ్నం ఓ విషాదకర ఘటన జరిగింది. మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందాడని చెప్పేందుకు చింతిస్తున్నాం. ఈ కేసును పోవై పోలీసులు విచారిస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాం. వారు ఇక్కడికి వస్తున్నారు. విద్యార్థి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. అతడి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా” ఆయన ఓ నోట్‍ను విడుదల చేశారు.

వేధింపుల వల్లే అంటూ ఆరోపణలు

Student Dies in IIT Bombay: కుల వివక్ష వేధింపులే దర్శన్ సోలంకి ఆత్మహత్యకు దారి తీశాయని ఏపీపీఎస్‍సీ (అంబేడ్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్) ఐఐటీ బాంబే ట్వీట్ చేసింది. “మేం అనేక ఫిర్యాదులు చేశాం. అయినా, దళిత బహుజన ఆదివాసి విద్యార్థులకు ఇన్‍స్టిట్యూట్‍ను సురక్షితంగా మార్చేలా ఎలాంటి చర్యలు జరగలేదు. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు.. క్యాంపస్‍లో వివక్షను, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ వేధింపులు ఎక్కువగా ఎదురవుతున్నాయి” అని ఏపీపీఎస్‍సీ పోస్ట్ చేసింది. రిజర్వేషన్ వ్యతిరేక సెంటిమెంట్ల కారణంగా తొలి సంవత్సర విద్యార్థులు వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది.

తదుపరి వ్యాసం