PeoplesPulse: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి స్వల్ప మొగ్గు: పీపుల్స్ పల్స్ సర్వే
20 October 2022, 15:12 IST
- PeoplesPulse: హిమాచల్ ప్రదేశ్‌లో తిరిగి బీజేపీకే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది.
మండి: హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యత లభించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ సర్వే తేల్చింది. ఆ రాష్ట్రంలో నవంబరు 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో అధికార బీజేపీకి 35 నుండి 40 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 25 నుండి 30 స్థానాలు, ఆమ్‌ఆద్మీ పార్టీకి 1 నుండి 2 స్థానాలు, ఇతరులకు 0 నుండి 2 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ తన సర్వే ద్వారా స్పష్టం చేసింది.
రాష్ట్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీ అయినా 35 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. 2017 లో జరిగిన ఎన్నికల్లో సాధించిన సీట్లు తిరిగి లభించే అవకాశం మాత్రం లేకపోయినప్పటికీ బీజేపీ స్వల్ప ఆధిక్యత కనబరిచే అవకాశం ఉందని సర్వే తేల్చింది. బిజెపి పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పార్టీ గట్టిపోటీనే ఇస్తోందని, ఆమ్‌ఆద్మీపార్టీ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోందని సర్వే ద్వారా అవగతమవుతోంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ చీల్చడం వల్ల కాంగ్రెస్ అవకాశాలకు గండిపడి ఆ మేర వారికి నష్టం జరుగొచ్చు. ఒకే పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇవ్వని హిమాచల్‌ప్రదేశ్ ఓటర్ల రికార్డును ఈ సారి బీజేపీ తిరగరాయడానికి, ఇదే ముఖ్య కారణం అయినా ఆశ్చర్యం లేదని సర్వే తేల్చింది.
బీజేపీకి 42 శాతం ఓట్లు
పీపుల్స్‌పల్స్ నిర్వహించిన మూడ్‌సర్వే ప్రకారం బీజేపీకి 42 శాతం, కాంగ్రెస్‌కు 38 శాతం, ఆమ్‌ఆద్మీ పార్టీకి 6 శాతం, ఇతరులకు మిగిలిన ఓట్లు లభించే అవకాశం ఉన్నట్లు స్పష్టమౌతోంది.
చిన్న రాష్ట్రం కావడం, నియోజకవర్గాల్లో తక్కువ సంఖ్యలో ఓటర్లుండటం వంటి అంశాల వల్ల గెలుపోటముల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల కూడా అంచనాలు నిజమవడంలో స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
అక్టోబర్ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్కాలర్స్‌తో కలిసి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 120 పోలింగ్ స్టేషన్లలో, 1500 సాంపిల్స్‌తో నిర్వహించిన మూడ్‌సర్వే ప్రకారం జనాభిప్రాయం విస్పష్టంగానే అధికార బిజెపి పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది.
దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్న ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీకి ఆశించిన స్థాయిలో ఇక్కడ ఆదరణ కనిపించలేదు. అయితే ప్రభావం మాత్రం ఉంది. మిగతా రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడే స్థాయిలో లేవు.
పన్నెండు జిల్లాలుగా విస్తరించి ఉన్న ఈ కొండలు లోయలు గల రాష్ట్రంలో గ్రామీణ జనాభాయే యెక్కువ. 68.64 లక్షల మొత్తం జనాభాలో 89 శాతం జనాభా 3226 గ్రామ పంచాయతీలూ, హ్యామ్లెట్లలో నివసిస్తోంది. ఎస్సీలు 25 శాతం మంది ఉన్నారు.
బిజెపి ప్రభుత్వంపై నిర్దిష్టంగా బలమైన ప్రజావ్యతిరేకత ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గడచిన కాలంలో నిర్మించిన ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలో ఉండటం బీజేపీకి కలిసివచ్చింది. అందుకే బిజెపికి 44 శాతం ఓట్‌షేర్, కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్‌షేర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీకి 6 శాతం ఓట్‌షేర్ పొందే అవకాశాలున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలే అధిక సంఖ్యాకులైనప్పటికీ సుదీర్ఘ కాలంగా రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులే ఇక్కడి రాజకీయాల్ని శాసిస్తుంటారు. పార్టీ ఏదైనా ముఖ్యమంత్రులు ఆయా వర్గాల నుండే ఎంపిక అవుతున్నారు.
బీజేపీకి సానుకూల, ప్రతికూల అంశాలు ఇవే..
బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో, వివిధ స్థాయిల్లో నాయకుల, కార్యకర్తలు శ్రేణులుండటం సానుకూలాంశం. ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్‌కు మంచి పేరుండటం, ఆయన పదవీ కాలం పెద్ద వివాదాలేమీ లేకుండా గడచిపోవడం ఈ ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూర్చే అంశమే. రాష్ట్రం మొత్తమ్మీద ప్రభావం చూపగలిగిన ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరభద్రసింగ్, జీఎస్ బాలీ మరణం వల్ల ఏర్పడ్డ ఖాళీ ఇంకా అలాగే ఉండటం బీజేపీకి లాభించేదే. దానికి తోడు, పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇటీవలే, పార్టీ వరుసగా రెండో సారి అధికారం దక్కించుకోవడం పార్టీ శ్రేణులకు నైతిక బలం.
నిరుద్యోగ సమస్య, ఉద్యోగస్థులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్దరణ హామీ నెరవేర్చకపోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోవడం వంటివి అధికార బీజేపీకి ప్రతికూలాంశాలు. పార్టీ అంతర్గత విబేధాలు, ముఖ్యంగా జైరామ్ ఠాకూర్, పి.కె.ధూమల్ వర్గాల మధ్య పోరు వంటివి బీజేపీకి నష్టం చేసే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ అనుకూల, ప్రతికూలతలు ఇవే..
హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీకీ కలిసి వచ్చే పలు సానుకూలాంశాలున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జనావాసంలోనూ పార్టీ యంత్రాంగం ఉంది. ఇప్పటికీ చెక్కుచెదరని కార్యకర్తల వ్యవస్థ కాంగ్రెస్‌కు బలం. ప్రతిసారీ విపక్షానికి పట్టం గట్టే రాష్ట్ర ఓటర్ల మనస్తత్వం ‘ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్‌దే’ అనే చర్చకు దారితీస్తోంది. పైగా 2021లో ఉప ఎన్నికలు జరిగిన ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో అంతటా కాంగ్రెస్ గెలవటం ఆ పార్టీకి బలాన్నిచ్చేదే.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీనియర్ నేతలు లేకపోవడం, ఇటీవలి ఎన్నికల్లో ఒక రాష్ట్రంలోనైనా గెలువకపోవడం వంటివి పార్టీ శ్రేణుల నైతిక స్థయిర్యాన్ని బాగా కృంగదీస్తోంది. పిసిసి అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌కు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వకపోవడం తదితర అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆమ్‌ఆద్మీ పార్టీ విస్తరణ కూడా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ విజయావకాశాలను ఎంతో కొంత గండికొట్టేదే కావడం పార్టీకి ప్రతికూలాంశమని పీపుల్స్ పల్స్ తన సర్వే ద్వారా విశ్లేషించింది.