Sensex tumbles: రూ. 4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
23 September 2022, 17:20 IST
- వడ్డీ రేట్ల పెంపు కాలం ఇంకా ముగియలేదని అమెరికా ఫెడ్ ఇచ్చిన సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లను పతనంలోకి నెట్టేస్తున్నాయి.
సెప్టెంబరు 21న ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం కిందికి దిగుతున్న ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్
ముంబై, సెప్టెంబరు 23: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠినతరమైన ద్రవ్యవిధానం దిశగా సంకేతాలు ఇవ్వడంతో బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరిస్తూ భారత స్టాక్ మార్కెట్ కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం దాదాపు రెండు శాతం క్షీణించాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేటు పెంపు ఇంకా కొనసాగుతుందని అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలివ్వడమే ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బిఎస్ఇ సెన్సెక్స్ 1020.80 పాయింట్లు (1.73 శాతం) క్షీణించి 58,098.92 పాయింట్లకు చేరుకుంది. వరుసగా నాలుగో రోజు నష్టాలను పొడిగిస్తూ సెన్సెక్స్ 59,005.18 పాయింట్ల వద్ద రెడ్‌లో ప్రారంభమై ఇంట్రా-డేలో 57,981.95 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్కెట్లు నష్టపోవడం ఇది వరుసగా నాలుగో రోజు. సెన్సెక్స్ గురువారం 337.06 పాయింట్లు క్షీణించింది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క విస్తృత నిఫ్టీ 50 సూచీ 302.45 పాయింట్లు (1.72 శాతం) క్షీణించి 17,327.35 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ గురువారం 88.55 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది.
సెప్టెంబరు 21న అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీ రేటులో 75 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి.
బ్యాంకింగ్ స్టాక్స్ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.99 శాతం పతనమై రూ. 550.45కు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.64 శాతం క్షీణించి రూ. 1446.50కి చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా అన్ని ప్రధాన బ్యాంకులు భారీ నష్టాలతో ముగిశాయి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 7.93 శాతం క్షీణించి రూ. 202.60కి చేరుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా 3 శాతం క్షీణించి రూ.1271.30కి చేరుకుంది.
ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.87 శాతం క్షీణించి రూ. 2439.35 వద్దకు చేరుకుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టిపిసి, హెచ్‌డిఎఫ్‌సి, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
బెంచ్‌మార్క్ సెన్సెక్స్‌లో భాగమైన 30 స్క్రిప్‌లలో మూడు మాత్రమే సానుకూలంగా ముగిశాయి. సన్ ఫార్మా 1.53 శాతం దూసుకెళ్లి రూ. 920.80కి చేరుకుంది. ఐటీసీ 0.33 శాతం పెరిగి రూ. 346.25కు చేరుకుంది.
టాటా స్టీల్‌తో విలీనం కానున్న ఏడు టాటా గ్రూప్ కంపెనీల్లో నాలుగు లిస్టయ్యాయి. ఈ నాలుగు కంపెనీలూ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 8.73 శాతం క్షీణించి రూ. 683.50కి చేరుకుంది. ఇంట్రా-డేలో స్క్రిప్ రూ. 679.65 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.
థర్డ్-పార్టీ రికవరీ ఏజెంట్లను ఉపయోగించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధించిన తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రోజుకు 14 శాతానికి పైగా క్రాష్ అయ్యింది.
బిఎస్‌ఇలో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేరు 11.42 శాతం తగ్గి రూ.198.20 వద్ద ట్రేడవుతోంది. స్క్రిప్ ఇంట్రా-డేలో రూ. 192.05 కనిష్ట స్థాయికి క్రాష్ అయ్యింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ‘తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఔట్‌సోర్సింగ్ ఏర్పాట్ల ద్వారా రికవరీ లేదా తిరిగి స్వాధీనం చేసుకునే కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి..’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది.
అయితే ఈ ఎన్‌బిఎఫ్‌సి తన సొంత ఉద్యోగుల ద్వారా రికవరీ లేదా రిపోసెషన్ కార్యకలాపాలను కొనసాగించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.