`జ్ఞాన్‌వాపీ` విచారణ నిలిపేయండి; వారణాసి కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
19 May 2022, 17:20 IST
కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన్‌వాపీ మసీదు వీడియో సర్వే నివేదికను అధికారులు వారణాసిలోని సివిల్ కోర్టుకు అందించారు. ఆ నివేదికలో డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలను పొందుపర్చారు. మరోవైపు, ఈ కేసు తదుపరి విచారణను నిలిపేయాలని సుప్రీంకోర్టు వారణాసి కోర్టును ఆదేశించింది.
జ్ఞాన్‌వాపీ మసీదులోని కొలనులో లభ్యమైన శివలింగంగా వైరల్ అవుతున్నఫొటో
మే 14, 15, 16 తేదీల్లో ఈ సర్వే చేశారు. అనంతరం సమగ్ర వివరాలతో గురువారం ఆ నివేదికను స్పెషల్ అడ్వకేట్ కమిషనర్ విశాల్ సింగ్ కోర్టుకు అందజేశారు. మరోవైపు, ఈ కేసు తదుపరి విచారణను నిలిపేయాలని సుప్రీంకోర్టు వారణాసి కోర్టును ఆదేశించింది. వారణాసి కోర్టు మొదట అజయ్ కుమార్ మిశ్రాను స్పెషల్ అడ్వకేట్ కమిషనర్ గా నియమించింది. మసీదుల కొంతవరకు సర్వేను ఆయనే నిర్వహించారు. సర్వే వివరాలను మీడియాకు అందించడంపై ఆగ్రహించిన కోర్టు.. ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. తరువాత విశాల్ సింగ్ ను స్పెషల్ అడ్వకేట్ కమిషనర్, అజయ్ ప్రతాప్ సింగ్‌ను అసిస్టెంట్ అడ్వొకేట్ కమిషనర్ గా నియమించింది.
శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ
జ్ఞాన్‌వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం చేపట్టనుంది. ఈ కేసు విచారణను నిలిపేయాలని గురువారం సుప్రీంకోర్టు వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. సర్వే సందర్భంగా మసీదులోని వజూ ఖానాలో ఉన్న చిన్న కొలనులో శివలింగం లభ్యమైందన్న వార్తలు వెలువడ్డాయి. సంబంధిత ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. వారణాసి కోర్టులో విచారణను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ తరఫు న్యాయవాది గురువారం వాదనల సందర్భంగా కోర్టును కోరారు. జ్ఞాన్‌వాపీ మసీదులోని వజూఖానా చుట్టూ ఉన్న గోడను కూల్చమని ఆదేశించాలని కోరుతూ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలైన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. దాంతో, జ్ఞాన్‌వాపీ మసీదుకు సంబంధించిన అన్ని పిటిషన్ల విచారణను నిలిపేయాలని వారణాసి కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
టాపిక్