SBI raises BPLR: వడ్డీ రేట్లను 0.70 శాతం పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
15 September 2022, 11:14 IST
- SBI raises BPLR: వడ్డీ రేట్లను 0.70 శాతం పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
వడ్డీ రేట్లు పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్‌ఆర్)ను 70 బేసిస్ పాయింట్లు (లేదా 0.7 శాతం) పెంచి 13.45 శాతానికి చేర్చింది.
ఈ నేపథ్యంలో బిపిఎల్‌ఆర్‌తో లింక్ అయి ఉన్న లోన్ చెల్లింపు భారంగా మారుతుంది. ప్రస్తుత BPLR రేటు 12.75 శాతంగా ఉంది. దీనిని ఇదివరకు జూన్‌లో సవరించారు.
‘బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) సెప్టెంబర్ 15, 2022 నుండి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి 13.45 శాతంగా సవరించాం..’ అని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
బ్యాంక్ బేస్ రేటును కూడా ఇంతే బేసిస్ పాయింట్ల ద్వారా 8.7 శాతానికి పెంచింది. ఇది గురువారం నుండి అమలులోకి వస్తుంది. బేస్ రేటుతో రుణాలు తీసుకున్న రుణగ్రహీతలకు ఈఎంఐ మొత్తం పెరుగుతుంది.
బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు ఉపయోగించే పాత బెంచ్‌మార్క్‌లు ఇవి. ఇప్పుడు చాలా బ్యాంకులు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) లేదా రెపో-లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)పై రుణాలు అందజేస్తున్నాయి.
బ్యాంక్ బీపీఎల్ఆర్, బేస్ రేటు రెండింటినీ త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. ఎస్‌బీఐ రుణ రేట్ల సవరణను రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు అనుసరించే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన సమావేశంలో మరింతగా వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం, తదుపరి మూడు రోజుల ద్రవ్య విధాన సమావేశం సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 వరకు జరుగుతుంది.
టాపిక్