SBI PO Recruitment 2023: ఎస్బీఐ లో 2 వేల పీఓ వేకెన్సీలు; ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్స్
07 September 2023, 10:42 IST
SBI PO Recruitment 2023: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ప్రొబేషనరీ ఆఫీసర్ ల రిక్రూట్ మెంట్ (PO Recruitment) ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer PO) పోస్ట్ ల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది.
మొత్తం 2 వేల పోస్ట్ లు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ లను ఎస్బీఐ భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 27. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 2023 నవంబర్ నెలలో జరుగుతుంది.
అర్హతలు
ఎస్బీఐ లో ప్రొబేషనరీ పోస్ట్ లకు అప్లై చేయడానికి కనీస అర్హత డిగ్రీ. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం/సెమిస్టర్ లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ డిసెంబర్ 31, 2023 నాటికి డిగ్రీ పూర్తి చేయాలి. అలాగే, ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2023 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఎస్బీఐ లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష. ఇందులో ఉత్తీర్ణులైనవారు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్ సైజ్, ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అనంతరం, మెరిట్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ లో ప్రిలిమినరీ పరీక్ష మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
అప్లికేషన్ ఫీజు
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు గా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను చూడాలి.