'ఐఫోన్లు వద్దు.. అయ్య ఫోన్లు ముద్దు'.. దేశ పౌరులకు రష్యా ప్రభుత్వం సూచన
07 March 2022, 22:47 IST
- ఆపిల్ కంపెనీ రష్యాలో తమ ప్రొడక్ట్స్ విక్రయాలను నిలిపివేసింది. దీంతో ఇప్పుడు రష్యాలోని ప్రజలు ఐఫోన్‌లను వినియోగించలేరు. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఐఫోన్‌కు దీటుగా అయ్య ఫోన్‌ను పరిచయం చేస్తోంది.
Ayya T1 - Russian Smartphone
Moscow | ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ వివిధ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ కంపెనీలు ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన కంపెనీలు రష్యాలో తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, సామ్సంగ్, వీసా వంటి బ్రాండ్‌లు రష్యాలో తమ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశాయి.
దీంతో రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఎవరు, ఎలాంటి ఆంక్షలు విధించినా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌తో పాటుగా యూఎస్, యూకే, జపాన్ సహా మొత్తం 31 దేశాలను తమ శత్రు దేశాల జాబితాలో రష్యా చేర్చింది. దాదాపు ఎక్కువగా యూరోపియన్ దేశాలే ఉన్నాయి. ఆయా దేశాలపై రష్యా కూడా పలు ఆంక్షలను విధిస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే, ఆపిల్ కంపెనీ రష్యాలో తమ ప్రొడక్ట్స్ విక్రయాలను నిలిపివేసింది. దీంతో ఇప్పుడు రష్యాలోని ప్రజలు ఐఫోన్‌లను వినియోగించలేరు. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఐఫోన్‌కు దీటుగా అయ్య ఫోన్‌ను పరిచయం చేస్తోంది. అన్నింటికంటే శక్తివంతమైన, సురక్షితమైన అయ్య T1 స్మార్ట్‌ఫోన్‌నే రష్యన్ ప్రజలు వినియోగించాలంటూ రష్యన్ స్టేట్ చట్ట సభ్యులు సూచిస్తున్నారు.
రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్‌కు చెందిన స్మార్ట్ ఎకోసిస్టమ్ కంపెనీ ఈ అయ్య T1 ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ప్రత్యేకంగా రష్యాలోని పోలీసు ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రభుత్వ సంస్థల కోసం రూపొందించారు. ఈ ఫోన్ పనితీరు పూర్తిగా రష్యన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులోని డేటా పూర్తిగా సేఫ్‌గా ఉంటుంది. ఎలాంటి సైబర్ చోరీకి గురిఅవ్వదని హామీ ఇస్తున్నారు. ఐఫోన్ ధరతో పోలిస్తే అయ్య T1 ధర చాలా తక్కువ. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 10,500 నుంచి 20,000 మధ్య లభిస్తుంది.
టాపిక్