తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine | 1,119మంది పౌరులు.. 16,600మంది రష్యా సైనికులు బలి!

Ukraine | 1,119మంది పౌరులు.. 16,600మంది రష్యా సైనికులు బలి!

HT Telugu Desk HT Telugu

27 March 2022, 22:17 IST

google News
    • Ukraine crisis | రష్యాతో యుద్ధంలో 1,119మంది ఉక్రెయిన్​ పౌరులు మరణించారని ఐరాస వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు యుద్ధంలో 16వేలకుపైగా మంది రష్యన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్​ మీడియా తెలిపింది.
ఉక్రెయిన్​ యుద్ధంలో మరణించిన రష్యా జవాను
ఉక్రెయిన్​ యుద్ధంలో మరణించిన రష్యా జవాను (AP)

ఉక్రెయిన్​ యుద్ధంలో మరణించిన రష్యా జవాను

Russia Ukraine war | రష్యా ఉక్రెయిన్​ యుద్ధం తీవ్ర దుఖానికి దారితీస్తోంది. ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చుతోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్​లో 1,119మంది పౌరులు మరణించారని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం వెల్లడించింది. కాగా.. రష్యా దాడిలో మరో 1,790మంది గాయపడినట్టు పేర్కొంది. మృతుల్లో 15మంది బాలికలు, 32మంది అబ్బాయిలు, 52మంది చిన్నారులు ఉన్నట్టు వివరించింది. అయితే.. వాస్తవంలో మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎన్​ అభిప్రాయపడింది. రష్యా భీకర దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లోని మరణాల సంఖ్యపై స్పష్టత లేదని తెలిపింది.

మరోవైపు.. యుద్ధంలో 16,600మంది రష్యా సైనికులు మరణించినట్టు ఉక్రెయిన్​ మీడియా ప్రకటించింది. 582 రష్యన్​ ట్యాంకులు ధ్వంసమైనట్టు తెలిపింది. శత్రు దేశానికి చెందిన 1,664 వాహనాలు, 127 హెలికాఫ్టర్లు కూడా నాశమైనట్టు స్పష్టం చేసింది.

అయితే ఈ విషయంపై రష్యా వాదన మరో విధంగా ఉంది. మరణాల సంఖ్యపై శుక్రవారమే రష్యా ఓ ప్రకటన చేసింది. ఉక్రెయిన్​పై యుద్ధంలో 1,351 రష్యన్​ జవాన్లు మాత్రమే మరణించినట్టు పేర్కొంది. మరో 3,825మందికి గాయాలైనట్టు వెల్లడించింది. నాటో మాత్రం.. రష్యా సైనికుల మరణాల సంఖ్య 7వేలు- 15వేల మధ్యలో ఉంటుందని అంచనా వేసింది.

పెరుగుతున్న శరణార్థుల సంఖ్య..

Ukraine refugees numbers | రష్యా ఉక్రెయిన్​ యుద్ధం వేళ సరిహద్దు దేశాలకు వలస వెళుతున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతోంది. యుద్ధం ఆరంభం నుంచి 3.8మిలియన్​ మంది ఉక్రెయిన్​వాసులు పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం పొందుతున్నట్టు ఐక్యరాజ్య సమితి గణాంకాలు సూచిస్తున్నాయి. వీరిలో 90శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.

3.8మిలియన్​ మంది శరణార్థుల్లో 2.2మిలియన్​ మంది.. పొలాండ్​లోనే ఉన్నారు. 5లక్షల మంది రొమేనియాకు వెళ్లారు. కాగా.. 3లక్షల మంది రష్యాలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరో 6.5మిలియన్​ మంది ఉక్రెయిన్​వాసులు.. ఇళ్లను విడిచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆశ్రయం కోసం తరలి వెళ్లిపోయినట్టు యూఎన్​ స్పష్టం చేసింది.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం.. యూరోప్​లోనే అతిపెద్ద సంక్షోభంగా ఉక్రెయిన్​ యుద్ధ పరిణామాలు నిలిచాయి.

టాపిక్

తదుపరి వ్యాసం