అణ్వాయుధాలు సిద్ధం చేస్తున్న పుతిన్.. చర్చలకు ఉక్రెయిన్ ఓకే!
01 March 2022, 13:45 IST
Russia Ukraine talks | ఉక్రెయిన్‌పై దండయాత్ర వేళ.. దేశ డిటర్రెన్స్ ఫోర్స్‌ను హై అలర్ట్‌లో పెట్టారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అణ్వాయుధ దళానికి మరోపేరు డిటరెన్స్ ఫోర్స్. మరోవైపు బెలారస్ సరిహద్దులో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించినట్టు తెలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్
Putin nuclear Ukraine | ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి కోసం దేశ డిటర్రెన్స్ ఫోర్స్ హైఅలర్ట్‌లో ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. అణ్వాయుధాలు కలిగిన దళాలకు మరో పేరే ఈ డిటర్రెన్స్ ఫోర్స్. కాగా ఇది బయటకొచ్చిన కొద్దిసేపటికే.. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సిద్ధమని మరికొన్ని వార్తలు వెలువడ్డాయి.
పుతిన్ పిలుపు..
డిటర్రెన్స్ ఫోర్స్‌ను సిద్ధం చేయాలని రష్యా మిలిటరీకి స్పష్టం చేశారు పుతిన్.
"నాటో నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నారు. మన మీద కుట్రపూరితంగా చర్యలు చేపడుతున్నారు. వీటిని మనం చూస్తూనే ఉన్నాము," అని పుతిన్ పేర్కొన్నారు.
పుతిన్ పిలుపుపై ప్రపంచ దేశాధినేతలు మండిపడుతున్నారు.
చర్చలకు సిద్ధం..
Ukraine invasion | బెలారస్లో రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. బెలారస్ సరిహద్దులోని చెర్నోబిల్ ప్రాంతంలో చర్చలకు వస్తామని పేర్కొన్నారు.
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో ఫోన్లో మాట్లాడిన అనంతరం జెలెన్స్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రష్యా విషయానికొస్తే.. ఉన్నతస్థాయి అధికారులు ఇప్పటికే బెలారస్లో ఉన్నారు.
వాస్తవానికి.. బెలారస్లో చర్చలు జరుపుదామని రష్యా అనేకమార్లు ప్రతిపాదించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా దానిని ఉక్రెయిన్ తిరస్కరించింది. రష్యాతో కలిసి తమపై దాడి చేస్తున్న దేశంలో ఎలా చర్చలు జరుపుతామని ప్రశ్నించింది. బెలారస్ కాకుండా వేరే ఎక్కడైనా చర్చలకు వస్తామని తేల్చిచెప్పింది. ఆ తర్వాతి కొద్ది గంటలకే పరిస్థితుల్లో వేగంగా మార్పులు కనిపించాయి.
ఇదీ వివాదం..
Russia Ukraine conflict | కొన్నేళ్ల పాటు తీవ్రంగా ఉన్న రష్యా- ఉక్రెయిన్ వివాదం.. కొన్ని నెలలుగా మరింత ముదిరింది. నాటోలో చేరాలని ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా మండిపడింది. నాటోలో ఉక్రెయిన్ చేరితే, ఆ దేశంపై ఆధిపత్యం చెలాయించడం కష్టమని భావించి.. వివాదాన్ని తీవ్రతరం చేసింది! రెండు నెలల వ్యవధిలో సరిహద్దుకు లక్షలాదిమంది బలగాలను, ఆయుధాలను పంపింది.
ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బైడెన్ సహా యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. అవి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి.
అయితే తమకు దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా పదేపదే చెబుతూ వచ్చింది. ఈ తరుణంలోనే.. బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించింది. కాగా.. ఇతర దేశాలు రష్యా మాటలను విభేదించాయి. రష్యా చెప్పినట్టు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదని చెప్పాయి. వాటి అంచనాలకు తగ్గట్టుగానే ఈ గురువారం.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది.
టాపిక్