Dollar vs Rupee: 80ని ముద్దాడిన రూపాయి.. 79.98కి ఒక డాలర్
18 July 2022, 16:28 IST
- Dollar vs Rupee: డాలరు విలువతో పోలిస్తే రూపాయి విలువ సోమవారం 80ని తాకింది.
న్యూఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన హోర్డింగ్
ముంబై, జూలై 18: డాలరు రేటు ఇంట్రా డేలో 80ని ముద్దాడింది. యూఎస్ కరెన్సీ డాలరుతో పోల్చితే రూపాయి చివరకు 15 పైసలు నష్టపోయి 79.98 వద్ద స్థిరపడింది. క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధులు వెనక్కి మళ్లడం వంటి కారణాల వల్ల రూపాయికి కలిసి రాలేదు.
ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ వద్ద రూపాయి ఈ ఉదయం 79.76 వద్ద ఓపెన్ అయ్యింది. కానీ ఒక దశలో బలహీనపడి ఇంట్రా డేలో 80ని టచ్ చేసింది.
చివరకు 15 పైసలు నష్టపోయి 79.98 వద్ద స్థిరపడింది. శుక్రవారం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 17 పైసల మేర పుంజుకుని 79.82 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
‘భారతీయ రూపాయి దేశీయ మార్కెట్లలో లాభాలు, స్వల్పంగా డాలరు బలహీనపడడం వంటి కారణాల వల్ల ఈ ఉదయం స్వల్పంగా పుంజుకుంది. కానీ క్రూడాయిల్ ధరల పెరుగుదల, ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిళ్లలో రూపాయి తిరిగి పతనమైంది. శుక్రవారం ఎఫ్ఐఐ ఔట్‌ఫ్లో రూ. 1,649 కోట్లుగా ఉంది..’ అని షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అన్నారు.
ప్రపంచ మార్కెట్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరగడం, యూఎస్ డాలర్ స్వల్పంగా బలహీనపడడం వంటి కారణాల వల్ల రూపాయి సానుకూలంగా ట్రేడవుతుందని, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్లు కూడా రూపాయికి అండగా నిలుస్తాయని చౌదరి వివరించారు.
‘అయితే క్రూడాయిల్ ధరల పెరుగుదల, ఎఫ్ఐఐల నిరంతర అమ్మకాలు రూపాయి లాభపడకుండా ఉండే పరిస్థితి ఎదురవుతుంది. రూపాయి విలువ రూ. 79.20 నుంచి రూ. 80.80 మధ్య ట్రేడయ్యే పరిస్థితి ఉందని చౌదరి తెలిపారు.
డాలర్ ఇండెక్స్ 0.50 శాతం పెరిగి 107.52 పాయింట్ల వద్ద ఉందని తెలిపింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.06 శాతం పెరిగి 103.24 డాలర్లుగా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 760.37 పాయింట్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 760.37 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 229.30 పాయింట్లు లాభపడింది.