Rupee all-time low: రూపాయి భారీ పతనం.. డాలరుకు 81.93 రూపాయలు
28 September 2022, 10:31 IST
Rupee all-time low: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరోసారి జీవిత కాలపు కనిష్టానికి చేరుకుంది.
డాలరుతో పోలిస్తే 81.93కు పడిపోయిన రూాపాయి విలువ
Rupee all-time low: రూపాయి విలువ బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే 40 పైసలు తగ్గి 81.93కి పడిపోయింది. ఇన్వెస్టర్లు రిస్క్ లేని పెట్టబడుల వైపు మళ్లుతుండడంతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ 0.40 శాతం పెరిగి 114.55 డాలర్లకు చేరుకుంది.
అంతేకాకుండా, దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని ఫారిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకద్రవ్యం వద్ద రూపాయి డాలరుతో పోల్చితే 81.90 వద్ద ప్రారంభమై తరువాత 81.93 కు పడిపోయింది. క్రితం ముగింపు కంటే 40 పైసలు పతనం నమోదు చేసింది.
ఫెడరల్ రిజర్వ్ వరుస వడ్డీ రేట్ల పెంపు కారణంగా డాలర్ ఇండెక్స్ బలపడుతూ రూపాయి బలహీన పడుతోందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు.
‘అస్థిరతను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జోక్యం చేసుకోవచ్చు..’ అని అయ్యర్ పేర్కొన్నారు.
శుక్రవారం ఆర్‌బీఐ తన ద్రవ్య విధాన సమావేశం జరిపే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటును పెంచుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.
ఇక గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.33 శాతం పడిపోయి బ్యారెల్‌కు 85.12 డాలర్లకు చేరుకుంది.
దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో 30-షేర్ బిఎస్ఇ సెన్సెక్స్ 373.37 పాయింట్లు పడిపోయి 56,734.15 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 108.20 పాయింట్లు పడిపోయింది.
రూ .2,823.96 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం ద్వారా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం క్యాపిటల్ మార్కెట్లో నికర అమ్మకందారులుగా ఉన్నారు.