Rupee breaches 81 mark: 81.09కి పడిపోయిన రూపాయి.. బలంగా డాలర్
23 September 2022, 10:20 IST
- Rupee breaches 81 mark: రూపాయి విలువ డాలరుతో పోలిస్తే జీవితకాలపు కనిష్టానికి పడిపోయింది.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 81.09కి పడిపోయింది
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: డాలర్ వంటి సురక్షితమైన కరెన్సీకి డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశతో, ఈ వారంలో అమెరికా డాలర్ ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి బలపడింది. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం రూపాయి మరోసారి జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది.
ఈ ఉదయం రూపాయి విలువ డాలరుతో పోలిస్తే క్రితం రోజు సెషన్ ముగింపు విలువ 80.86 నుండి 25 పైసలు దిగువన ప్రారంభమై 81.09 వద్ద రికార్డు స్థాయికి పడిపోయింది. నిన్నటి తరుగుదల ఫిబ్రవరి 24 తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పతనం కావడం గమనార్హం.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వరుసగా మూడోసారి పెంపు. ఈ క్రమంలో మెరుగైన, స్థిరమైన రాబడుల కోసం పెట్టుబడిదారులు అమెరికా మార్కెట్ల వైపు మొగ్గు చూపుతారు.
మరికొన్నిసార్లు రేట్ల పెరుగుదల ఉంటుందని, ఈ రేట్లు 2024 వరకు పెరుగుతూనే ఉంటాయని కూడా ఫెడ్ సూచించింది. వడ్డీ రేట్లను పెంచడం అనేది ద్రవ్య విధాన సాధనం. ఇది సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను అణచివేయడంలో సహాయపడుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం రేటు తగ్గుదలకు సహాయపడుతుంది.
అమెరికాలో వినియోగదారుల ద్రవ్యోల్బణం జూలై నాటి 8.5 శాతం నుండి ఆగస్టులో 8.3 శాతానికి స్వల్పంగా తగ్గినప్పటికీ లక్ష్యిత ద్రవ్యోల్భణమైన 2 శాతానికి తగ్గడంలో చాలా దూరంలో ఉంది.
స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా మాట్లాడుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాాజా చర్య, వ్యాఖ్యానం ప్రకారం రేట్ల పెంపు చక్రం ముగిసే సమయం చాలా దూరంలో ఉందని, రూపాయి ఒత్తిడిలో కొనసాగుతుందని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా భారత ఫారెక్స్ నిల్వలు రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసినప్పటి నుండి నిల్వలు దాదాపు 80 బిలియన్ డాలర్లు తగ్గాయి.
క్షీణిస్తున్న రూపాయిని రక్షించడానికి మార్కెట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకునే అవకాశం ఉన్నందున, గత కొన్ని నెలలుగా భారతదేశపు ఫారెక్స్ నిల్వలు స్థిరంగా క్షీణిస్తున్నాయి. సాధారణంగా రూపాయి విలువ బాగా క్షీణించడాన్ని నిరోధించే ఉద్దేశ్యంతో డాలర్ల విక్రయంతో సహా ద్రవ్య నిర్వహణ ద్వారా ఆర్‌బిఐ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటుంది.
రూపాయి విలువ క్షీణించడం సాధారణంగా దిగుమతి చేసుకున్న వస్తువులను ఖరీదైనదిగా చేస్తుంది. అమెరికా ఫెడ్ వరుసగా మూడోసారి వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించుకున్నందున డాలర్ ఇండెక్స్ బలపడవచ్చు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఈ సంవత్సరం అత్యంత వేగవంతంగా రేట్లను పెంచడం కొనసాగుతుందని కూడా ఫెడ్ సూచించింది…’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది.