Political Roundup 2022: ఈ ఏడాది ఊహించని ‘పొలిటికల్ ట్విస్ట్‌లు’ ఇవే.. ఆ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా మారిన సీన్
26 December 2022, 20:39 IST
- Political Roundup 2022: ఈ ఏడాది మహారాష్ట్ర, బిహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఊహించని పరిణామాలు జరిగాయి. రాజకీయాలు మలుపులు తిరిగాయి. ఆ వివరాలు ఇవే.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
Political Roundup 2022: కొన్నిసార్లు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. పరిస్థితులు మొత్తం తిరగబడిపోతుంటాయి. ఏకంగా ప్రభుత్వాలే చేతులు మారుతుంటాయి. ఎమ్మెల్యేల జంపింగ్‍లు, పొత్తుల మార్పులతో అనుకోని షాక్‍లు ఎదురవుతుంటాయి. అలా 2022లోనూ రాజకీయాల్లో కొన్ని మలుపులు ఉన్నాయి. అయితే ఓ రెండు ట్విస్టులు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. రోజుల వ్యవధిలోనే ఎవరూ ఊహించని వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)కి లాభించింది. ఇక బిహార్ లో మాత్రం ఆ పార్టీకి షాక్ ఎదురైంది. అక్కడ కాషాయ పార్టీకి జేడీయూ షాకిచ్చి.. రాజకీయాలను మలుపు తిప్పింది. 2022లో జరిగిన ఈ రెండు పొలిటికల్ ట్విస్టుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఆద్యంతం ఉత్కంఠగా మహా‘డ్రామా’
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు జరిగాయి. ఎప్పుడూ ఊహించని విధంగా శివసేన ఎమ్మెల్యే ఏక్‍నాథ్ షిండే (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. 2019 నుంచి పాలిస్తున్న శివసేన, కాంగ్రెస్, ఎన్‍సీపీతో కూడిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. శివసేన బాస్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏక్‍నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన చీలిపోయింది. భారతీయ జనతా పార్టీతో కలిసి షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ముందుగా తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి శివసేన నుంచి ఏక్‍నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆ తర్వాత ఏకంగా 37 మందిని కూడగట్టారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. ముంబై, గోవా, గుజరాత్, అసోంతో పాటు పలు చోట్ల క్యాంపులు కట్టారు. అనర్హత వేటు, సుప్రీం కోర్టు తీర్పు, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఇలా చాలా పరిణామాలు జరిగాయి. వారాల పాటు ఉత్కంఠ కొనసాగింది. చివరికి బీజేపీ మద్దతుతో ఈ ఏడాది జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్‍నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్నారు. కుట్రతో తమ పార్టీని చీల్చారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీని విమర్శించారు.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్‍సీపీ 54 స్థానాల్లో గెలిచాయి. అధికారం చేపట్టేందుకు కావాల్సిన 145 సీట్లు ఏ పార్టీకి రాలేదు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్‍సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఈ ఏడాది జూన్‍లో శివసేన పార్టీని చీల్చిన ఏక్‍నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు.
బిహార్‌లో బీజేపీకి షాక్
మహారాష్ట్రలో అనూహ్య రీతిలో ప్రభుత్వంలో భాగమైన బీజేపీకి బిహార్‌లో ఎదురుదెబ్బ తగిలింది. జనతా దళ్ యునైటెడ్ (Janata Dal United) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ఏడాది కషాయ పార్టీకి ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. రాష్ట్రీయ జనతా దళ్(RJD) తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆగస్టులో మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాలు, బీజేపీ 74 సీట్లు, జేడీయూ 43 స్థానాల్లో గెలిచింది. బీజేపీ, జేడీయూ కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో బీజేపీకి గుడ్‍బై చెప్పారు నితీశ్. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిగా ఉన్నా తమ పార్టీని బీజేపీ బలహీనపరిచేందుకు కుట్ర చేసిందని నితీశ్ కుమార్ ఆరోపించారు.
ఇలా మహారాష్ట్ర, బిహార్‌లో ఈ ఏడాది రాజకీయాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది.