UK Prime Minister Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవ ఎన్నిక
24 October 2022, 19:44 IST
- బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. పెన్నీ మోర్డాన్ పోటీ నుంచి తప్పుకోవండో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనమే అయింది.
బ్రిటన్‌కు ప్రధాని అయిన మెుదటి నాన్ వైట్ వ్యక్తి రిషి సునాకే. రిషి సునాక్ కంటే.. ముందే.. చాలామంది దక్షిణాసియా సంతతికి చెందిన వారు బ్రిటన్‌లో మేయర్లుగా, మంత్రులుగా పదవుల్లోకి ఎక్కారు. ప్రీతి పటేల్, సాజిద్ జావిద్, సాదిఖ్ ఖాన్ ఇలా చాలామంది ఆ జాబితాలో ఉన్నారు. కానీ బ్రిటన్ ప్రధాని పీఠంపై ఎక్కిన తొలి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.
అత్యంత ఆసక్తిగా..
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక ప్రధాని లిజ్‌ట్రస్ రాజీనామా ప్రకటించారు. దీంతో నూతన ప్రధాని ఎంపికను కన్జర్వేటివ్ పార్టీ అత్యంత వేగంగా నిర్వహించింది. రిషి సునాక్, బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ ప్రధాని రేసులో ఉన్నారు. అయితే ముందుగానే.. బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకొన్నారు. 'కన్జర్వేటివ్ నాయకుడిగా నాకు చట్టసభ సభ్యుల మద్దతు ఉంది. పార్టీ ఐక్యత కోసం కన్జర్వేటివ్ నాయకత్వానికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను.' అని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు కావాలి. తమకు పూర్తి మద్దతు ఉన్నట్లు బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలలోపే పోటీలో ఉన్న సభ్యులు వెల్లడించాలి. రిషి సునాక్‌కు 150కిపైగా ఎంపీల మద్దతు ఉంది. ప్రధాని పోటీలో ఉన్న.. పెన్నీ మోర్డాంట్ వందమంది ఎంపీల మద్దతు కూడ కష్టమైంది. దీంతో పోటీ నుంచి తప్పుకున్నట్టుగా చెప్పారు. ఈ కారణంగా యూకే ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికయ్యారు.
ప్రధాన మంత్రి అభ్యర్థిగా గతంలో లిజ్ ట్రస్‌తో పోటీపడి రిషి సునాక్ ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన టోరీ సభ్యుల మద్దతు కూడగట్టలేకపోయారు. ఇప్పుడు పెన్నీ మోర్డాంట్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టలేకపోయారు. దీంతో యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.