Restaurant bill: 70 పైసలకో రోటీ.. వైరల్ అయిన రెస్టారెంట్ బిల్
23 November 2022, 14:40 IST
- Restaurant bill: ఇప్పుడు రెస్టారెంట్ బిల్లులను మూడు నాలుగు దశాబ్దాల కిందటి బిల్లులతో చూస్తే ఆశ్చర్యమే.
1985 నాటి రెస్టారెంట్ బిల్లు
ఈరోజుల్లో బయట రెస్టారెంట్లో తినాలంటే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్లి తినాలంటే రూ. 1000కి తక్కువ కాదు. ఈరోజుల్లో రెస్టారెంట్ బిల్లు ఈమాత్రం ఉండడం సాధారణమే. కొందరికి ఇదేమంత భారం కాదు. అయితే చాలా మందికి ఇది భరించలేని ఖర్చే. కానీ ఇప్పుడు మెనూలో ఉన్న డిషెస్ ఖర్చు సరిగ్గా 37 ఏళ్ల కిందట ఎలా ఉండేదో తెలుసా. అలాంటి వివరాలు అందించే బిల్లొకటి ఇప్పుడు వైరల్ అయింది.
ఫేస్‌బుక్‌లో దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి మళ్లీ వైరల్ అయింది. 1985 నాటి బిల్లును మీరు ఆ పోస్టులో చూడొచ్చు. దాల్ మఖ్నీ, రైతా, షాహీ పనీర్, రోటీల ఖర్చు మొత్తంగా రూ. 26.30 అయ్యింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇందులో 9 రోటీలకు రోటీకి 70 పైసల చొప్పున రూ. 6.30 అవా, షాహీ పనీర్ ప్లేట్ రూ. 8, దాల్ మఖ్నీ ప్లేట్ రూ. 5, రైతా రూ. 5గా ఉంది.
ఢిల్లీలోని లజీజ్ రెస్టారెంట్ అండ్ హోటల్ ఈ బిల్ షేర్ చేసింది. డిసెంబరు 20, 1985 నాటి బిల్లు ఇది.. అని క్యాప్షన్ ఇచ్చింది. 2013లో ఈ పోస్ట్ చేయగా, ఇప్పుడు మరోసారి వైరల్ అయ్యింది.
ఫేస్ బుక్ పోస్టు ఇక్కడ చూడొచ్చు.
ఈ పోస్టును చాలా మంది లైక్ చేసి కామెంట్ చేశారు. చాలా మంది ధరలు చూసి ఆశ్చర్యపోయారు. ‘ఆనాటి రోజులే నిజమైన అచ్చే దిన్..’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘ఓ మై గాడ్, నాడు చాల చవకగా లభించాయి. అప్పట్లో డబ్బుకు ఇప్పటి కంటే చాలా విలువ ఉండేది..’ అని మరొక యూజర్ కామెంట్ చేశారు. ‘ఆ సమయంలో చాలా పొదుపుగా ఖర్చు చేశారు. బిల్లులో సూప్, స్టార్టర్స్, డెజర్ట్ వంటివి లేవు చూడండి..’ అంటూ మరొక యూజర్ రాశారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఢిల్లీలో ఇప్పటికీ ఈ డిషెస్ ఫేమస్. అన్ని రెస్టారెంట్లలో ఈ ఐటమ్స్ తప్పక ఉంటాయి. దక్షిణాది ప్రాంతాల మెనూలో అనేక కొత్తకొత్త రుచులు వచ్చి చేరాయి. హైదరాబాద్‌లో అప్పుడూ ఇప్పుడూ బిర్యానీ చాలా ఫేమస్ అయినప్పటికీ ఇప్పుడు మండి వంటివి వచ్చి చేరాయి.