రిలయన్స్ ఇండస్ట్రీస్: 4 శాతం పడిపోయిన స్టాక్
09 May 2022, 17:48 IST
న్యూఢిల్లీ, మే 9: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చి త్రైమాసిక ఆదాయాలు ఇన్వెస్టర్లను మెప్పించడంలో విఫలమవడంతో సోమవారం షేర్లు 4 శాతానికి పైగా పడిపోయాయి.
మెప్పించని త్రైమాసిక ఫలితాలు
చాలా రోజులుగా ఈ షేరు తక్కువ ధరకు కోట్ అవుతూ 3.97 శాతం క్షీణించి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 2,517.15 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్‌లో బలహీన ధోరణి కారణంగా ఇంట్రా డేలో ఇది 4.35 శాతం తగ్గి రూ.2,507.10కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.29 శాతం క్షీణించి రూ. 2,508 వద్ద ముగిసింది.
ఏప్రిల్ 29 నుండి బీఎస్‌ఈలో స్టాక్ 10.71 శాతం పడిపోయింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ కూడా రూ. 2,04,624.12 కోట్లు తగ్గి రూ. 17,02,844.88 కోట్లకు పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 364.91 పాయింట్లు (0.67 శాతం) క్షీణించి 54,470.67 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లోని స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధానంగా నష్టపోయిన కంపెనీగా నిలిచింది.
‘ఫలితాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ తీవ్ర నష్టానికి గురైంది. ఇది మొత్తం మార్కెట్లను ప్రతికూలంగా మార్చేసింది..’ అని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.
బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 22.5 శాతం పెరిగింది. బంపర్ ఆయిల్ రిఫైనింగ్ మార్జిన్లు, టెలికాం, డిజిటల్ సేవలలో స్థిరమైన వృద్ధి, రిటైల్ వ్యాపారంలో బలమైన అమ్మకాలు ఊపందుకోవడంతో ఇది సాధ్యమైంది.
మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 13,227 కోట్ల నుంచి రూ.16,203 కోట్లకు పెరిగిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే నికర లాభం 12.6 శాతం పడిపోయింది. గడిచిన ఆరు త్రైమాసికాలుగా నికర లాభంలో వృద్ధి ఉండగా.. ఈసారి మాత్రం దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.
బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్‌ల పెరుగుదల, ఆన్‌లైన్ రిటైల్ ట్రాక్షన్, కొత్త ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ మూలాలను ఎంచుకోవడం వల్ల రిలయన్స్ ఆదాయాలు కూడా పెరిగాయి.
టాపిక్