బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: మమతా బెనర్జీ
02 February 2022, 15:43 IST
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పిలుపునిచ్చారు. టీఎంసీ ఛైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికైన తర్వాత జరిగిన సమావేశంలో బెనర్జీ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కూడా చురకలంటించారు. అహం కారణంగా వెనకే ఉండిపోవాలనుకుంటే తమ పార్టీని నిందించరాదని అన్నారు.
‘2024లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలని కోరుకుంటున్నాం. అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి ఓడించాలని కోరుకుంటున్నాం. బీజేపీని ఓడించడమే మా నినాదం. పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం)ని ఓడించగలిగితే.. జాతీయ స్థాయిలో బీజేపీని కూడా ఓడించగలం’ అని బెనర్జీ అన్నారు.
మేఘాలయ, చండీగఢ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కాంగ్రెస్ సహకరించిందని ఆమె ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే వారు ఒకే వేదికపైకి రావాలని కోరుకుంటున్నామని, అయితే ఎవరైనా అహం కారణంగా వెనకే కూర్చోవాలనుకుంటే తమను తప్పుపట్టరాదని, అవసరమైతే బీజేపీపై ఒంటరిగానే పోరాడతామని ఆమె అన్నారు.
మేఘాలయలోని మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరడంతో అది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారింది. చండీగఢ్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ పదవికి ఓటు వేయకుండా దూరంగా ఉండడంతో మేయర్ సీటును బీజేపీ కైవసం చేసుకోగలిగింది. చాలా స్థానాల్లో ఆప్ గెలుపొందడంతో హంగ్ ఏర్పడింది.
బడ్జెట్ పెద్ద బుకాయింపు..
తాజా బడ్జెట్ ప్రజలను మోసం చేయడానికి వినియోగించిన పెద్ద బుకాయింపు అని మమత అభివర్ణించారు. ‘ఇది సామాన్యులకు ఏమీ లేని బడ్జెట్. ఇద్దరు వ్యక్తులు మాత్రమే భారతదేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, ఈ దేశ ప్రజలకు ఉద్యోగాలు, ఆహారం కావాలి. వారికి వజ్రాలు వద్దు..’ అని ఆమె అన్నారు.
‘పద్మభూషణ్ వంటి అవార్డులను కూడా రాజకీయం చేశారు. కొన్నేళ్లుగా రాజకీయాల కథనం మారిపోయింది. సంధ్య ముఖోపాధ్యాయ వంటి ప్రముఖ గాయనిని ఇలా అవమానిస్తే ఎలా? ప్రస్తుతం ఆమె ఆసుపత్రి పాలైంది. వాటికి వ్యతిరేకంగా మాట్లాడితే.. పెగాసస్‌ని ఉపయోగించి వారు మిమ్మల్ని బెదిరించి మీ ఫోన్‌లను ట్యాప్ చేస్తారు..’ అని ముఖ్యమంత్రి ఆరోపించారు.
నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలతో భారత్ సంబంధాల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని తమ పార్టీ ఎంపీలను కోరతానని బెనర్జీ చెప్పారు.