ఇక క్రెడిట్ కార్డు లింక్ చేసి యూపీఐ పేమెట్స్ చేయొచ్చు..
08 June 2022, 11:27 IST
- ఇన్నాళ్లూ యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే బ్యాంకు ఖాతా లింక్ అయి ఉంటే మాత్రమే చెల్లింపులు సాధ్యమయ్యేది. ఇప్పుడు క్రెడిట్ కార్డు లింక్ అయి ఉన్నా యూపీఐ పేమెంట్స్ సాధ్యం కానున్నాయి.
యూపీఐతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి ఆర్‌బీఐ అనుమతి
ముంబై, జూన్ 8: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) తో క్రెడిట్ కార్డులు కూడా లింక్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఈ కారణంగా ఎక్కువమంది ప్రజలు ఈ పాపులర్ ప్లాట్‌ఫామ్ ద్వారా చెల్లింపులు చేస్తారని ఆర్‌బీఐ ఆశిస్తోంది.
జూన్ 6, 7 తేదీల్లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం జూన్ 8న ఉదయం ఆర్‌బీఐ గవర్నర్ కమిటీ నిర్ణయాలను వెల్లడిస్తూ ఈ సంగతి వివరించారు.
ప్రస్తుతం కేవలం సేవింగ్స్ అకౌంట్స్ లేదా కరెంట్ అకౌంట్స్‌తో లింక్ అయి ఉన్న యూపీఐ ఖాతాల ద్వారానే చెల్లింపులు జరపొచ్చు.
‘యూపీఐతో క్రెడిట్ కార్డులను లింక్ చేయడాన్ని అనుమతించాలని ప్రతిపాదించాం..’ అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్‌బీఐ రెగ్యులేటరీ విధానాలను ప్రకటిస్తున్న సందర్భంగా చెప్పారు.
ఆర్‌బీఐ జారీ చేసిన, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రమోట్ చేసిన రూపే కార్డుతో తొలుత లింక్ చేయనున్నట్టు తెలిపారు.
ఈ వెసులుబాటులో ఎక్కువ మంది ప్రజలు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా సులువుగా చెల్లింపులు చేస్తారని ఆర్‌బీఐ భావిస్తున్నట్టు శక్తి కాంత దాస్ తెలిపారు.
దాదాపు 26 కోట్ల యూనిక్ యూజర్లు, 5 కోట్ల మంది మర్చెంట్లు ప్రస్తుతం యూపీఐ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నారని వివరించారు.
మే నెలలో రూ 10.40 లక్షల కోట్ల విలువైన 594.63 కోట్ల లావాదేవీలు యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా జరిగాయని వివరించారు.
టాపిక్