Russia Ukraine war: ‘వారికి రేప్ కూడా ఒక ఆయుధమే’
14 October 2022, 18:35 IST
- Russia Ukraine war: ఉక్రెయిన్ లో రష్యా సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని, ఇదంతా కూడా రష్యా సైనిక వ్యూహంలో భాగమేనని ఐక్య రాజ్య సమితి రాయబారి ఒకరు ఆరోపించారు.
యూఎన్ రాయబారి ప్రమీల పాటెన్
ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించి, ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి రష్యా దళాల ఆగడాలకు అంతులేకుండా పోతోందని యూఎన్ రాయబారి ప్రమీల పాటెన్ ఆరోపించారు.
Russia Ukraine war: పిల్లలను కూడా వదలడం లేదు..
ఉక్రెయిన్ లో రష్యా దళాల అకృత్యాలపై ప్రమీల పాటెన్ నివేదిక రూపొందించారు. ఉక్రెయిన్ పౌరులను బందీలుగా పట్టుకుని వారిని దారుణమైన లైంగికవేధింపులకు గురి చేస్తున్నారని ఆమె అందులో పేర్కొన్నారు. బాలికలపై, యువతులపై అత్యాచారం చేస్తున్నారన్నారు. మగవారిపై, బాలురపై కూడా లైంగిక దాడులు చేస్తున్నారని విమర్శించారు.
Russia Ukraine war: అత్యాచారం కూడా వారికి ఆయుధమే
ఇలా పౌరులపై అత్యాచారం వంటి లైంగిక దాడులకు పాల్పడడం వారి మిలటరీ వ్యూహంలో భాగమేనని ఆమె వివరించారు. బాధితులను భయ భ్రాంతులకు గురి చేయడం వారి లక్ష్యమన్నారు. అత్యాచారాన్ని కూడా వారు ఒక ఆయుధంగా వాడుతున్నారన్నారు. ‘రోజుల తరబడి బందీగా ఉంచి రేప్ లు చేస్తున్నారు. చిన్న పిల్లలు, మగవారిని కూడా వదలడం లేదు. వారి లైంగిక అవయవాలను చిధ్రం చేస్తున్నారు. రష్యా సైనికులకు వయాగ్రా టాబ్లెట్లను కూడా సప్లై చేస్తున్నారు. ఇదంతా సైనిక వ్యూహం కాదా?’ అని ఆమె ప్రశ్నించారు. వంద మందికి పైగా బాధితుల నుంచి సమాచారం తీసుకున్నానని, మొత్తం బాధితుల సంఖ్యతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని వివరించారు.