Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర విశేషాలు.. తొలిసారి వెల్లడించిన ట్రస్ట్
27 December 2023, 13:21 IST
Ayodhya Ram Mandir: అయోధ్య దిగువన భూగర్భ జల మట్టం ఎప్పటికీ తగ్గదని, ఆలయ సముదాయం ఎటువంటి వ్యర్థ జలాలను బయటకు విడుదల చేయదని రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది.
అయోధ్యలోని రామ మందిర ప్రాంగణ విశేషాలు
Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణ వివరాలను, పూర్తి ల్యాండ్ స్కేప్ మ్యాప్ ను విడుదల చేశారు.
70 ఎకరాల్లో..
అయోధ్య (Ayodhya) లో మొత్తం రామమందిర (Ram Mandir) ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంగణాన్ని పూర్తిగా ఆత్మ నిర్బర్ విధానంలో నిర్మించారు. ఇందులో మురుగునీటి ప్లాంట్లు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, అగ్నిమాపక దళం పోస్టు, ప్రత్యేక విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేశారు. అయోధ్య మున్సిపాలిటీకి ఆలయం భారంగా మారదని అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
రామ మందిర ప్రాంగణ వివరాలు..
1. ఆలయంలోకితూర్పు వైపు నుంచి ప్రవేశం, దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ఉంటుంది. మొత్తం ఆలయ సూపర్ స్ట్రక్చర్ మూడు అంతస్తులుగా ఉంటుంది.
2. ప్రధాన ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కాలి.
3. ఆలయ సముదాయం సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించబడింది. ఇది 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.
4. సాధారణంగా ఉత్తరాదిలోని దేవాలయాలకు పెర్కోటా (గర్భగుడి చుట్టూ బాహ్య భాగం) ఉండదు. కానీ అయోధ్యలో రామాలయానికి 14 అడుగుల వెడల్పు, 732 మీటర్ల వెడల్పుతో పెర్కోటాను ఏర్పాటు చేశారు.
5. ఈ పెర్కోటా నాలుగు మూలలు సూర్యభగవానుడు, మా భగవతి, వినాయకుడు, శివుడికి అంకితం చేశారు. ఉత్తరం వైపు అన్నపూర్ణ మాత, దక్షిణం వైపు హనుమంతుడు ఉంటారు.
6. వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, మాతా షబ్రీ, దేవి అహల్యలకు ప్రత్యేక ఆలయాలు ఉంటాయి. అయోధ్యలోని కుబేరుడి తిల వద్ద జటాయువు విగ్రహాన్ని ప్రతిష్టించారు.
7. ఈ కాంప్లెక్స్ లో హెల్త్ కేర్ సెంటర్, టాయిలెట్ బ్లాక్స్ ప్రత్యేకంగా ఉంటాయి. భక్తులు దర్శనానికి ముందు తమ బూట్లు, గడియారాలు, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 25 వేల మంది వరకు ఒకేసారి వీటిని డిపాజిట్ చేసుకోవచ్చు.
8. వేసవిలో సందర్శకులు ఫెసిలిటీ సెంటర్ నుంచి ఆలయం వరకు ఎండలో చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
9. ఆలయ సముదాయంలోని 70 ఎకరాల్లో 70 శాతం గ్రీనరీ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వందేళ్లకు పైబడిన చెట్లు ఉంటాయి. సూర్యకిరణాలు భూమికి చేరలేనంత దట్టమైన అడవి ఉండబోతోందని రాయ్ చెప్పారు.
10. ఈ కాంప్లెక్స్లో రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, డెడికేటెడ్ విద్యుత్ లైన్ ఉంటాయి. భూగర్భ జలాశయం నుంచి నీటిని సేకరించే అగ్నిమాపక దళ పోస్టు ఉంటుంది. భూగర్భ జలమట్టం ఎప్పటికీ తగ్గదు. అవసరమైతే సరయూ నది నుంచి నీటిని తీసుకుంటామని రాయ్ తెలిపారు.