Cylinder blast: గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురి సజీవ దహనం; మృతుల్లో ముగ్గురు చిన్నారులు
21 March 2024, 11:58 IST
Cylinder blast: గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగి ముగ్గురు మైనర్ పిల్లలు సహా కుటుంబ సభ్యులంతా సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్తాన్ లోని జైపూర్ లో జరిగింది. మృతులను బిహార్ కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.
ప్రతీకాత్మక చిత్రం
రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో గురువారం ఉదయం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు మైనర్లు సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ కు చెందిన ఓ కుటుంబం జైపూర్ శివార్లలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేందుకు జైపూర్ కు వచ్చి జస్లా ప్రాంతంలోని మురికివాడలో నివసిస్తోంది.
వంట చేస్తుండగా..
‘‘మహిళ వంటగదిలో పని చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. క్షణాల్లో ఇంట్లో మంటలు చెలరేగడంతో వారి ముగ్గురు మైనర్ పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ సజీవ దహనమయ్యారు’’ అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) రాజేంద్ర శర్మ తెలిపారు. "మృతదేహాలను శవపరీక్షకు పంపారు. సంఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని కూడా పిలిపించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది' అని శర్మ తెలిపారు. మృతుల కుటుంబాలకు రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సంతాపం తెలిపారు.
సీఎం సంతాపం
‘‘జైపూర్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు పౌరులు అకాల మరణం చెందడం హృదయ విదారకమైన వార్త. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధను భరించే శక్తి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు సరైన చికిత్స సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశాం’’ అని సీఎం భజన్ లాల్ పేర్కొన్నారు.