Bharat Nyay Yatra: తక్కువ సమయంలో ఎక్కువ దూరం; రాహుల్ గాంధీ ‘‘భారత్ న్యాయ యాత్ర’’ వ్యూహం..
28 December 2023, 13:31 IST
Rahul Gandhi's Bharat Nyay Yatra: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవమైన డిసెంబర్ 28వ తేదీకి ఒక రోజు ముందు, రాహుల్ గాంధీ చేపట్టనున్న రెండవ దశ భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ యాత్ర భారత్ జోడో యాత్రకు భిన్నంగా సాగనుంది.
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
Rahul Gandhi's Bharat Nyay Yatra: లోక్ సభ ఎన్నికలు (Lok sabha elections 2024) ప్రారంభం కావడానికి ముందు వ్యూహాత్మకంగా భారత్ న్యాయ యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఎన్నికల వేళ మెజారిటీ రాష్ట్రాల్లో అత్యధిక దూరం కొనసాగేలా ఈ యాత్రకు ప్లాన్ చేశారు.
మణిపూర్ నుంచి..
జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర (Rahul Gandhi's Bharat Nyay Yatra) మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. మణిపూర్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మాదిరిగా భారత్ న్యాయ్ యాత్ర రాజకీయ ర్యాలీ కాదని కాంగ్రెస్ పునరుద్ఘాటించినప్పటికీ లోక్ సభ ఎన్నికలకు ముందు ముగిసే భారత్ న్యాయ్ యాత్ర సమయం కీలకం. భారత్ జోడో యాత్ర మాదిరిగా కాకుండా, భారత్ న్యాయ్ యాత్రలో ప్రధాన ప్రయాణ మార్గం బస్సు. లోక్ సభ ఎన్నికలకు ముందే యాత్రను ముగించడం కోసమే పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేపట్టారనే వాదనను కాంగ్రెస్ తోసిపుచ్చింది.
భారత్ న్యాయ్ యాత్ర వర్సెస్ భారత్ జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022 న ప్రారంభమై 2023 జనవరిలో జమ్మూ కాశ్మీర్లో ముగిసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన ఈ యాత్రకు 136 రోజులు పట్టింది. భారత్ న్యాయ్ యాత్ర భారత్ జోడో యాత్ర కంటే ఎక్కువ దూరం కొనసాగుతుంది. భారత్ జోడో యాత్ర దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి సాగిన భారత్ జోడో యాత్ర మొత్తం 4500 కిలోమీటర్లు కొనసాగింది. ఇప్పుడు రాహుల్ ప్రారంభించనున్న భారత్ న్యాయ యాత్ర తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతానికి 6200 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది.
ఎన్నిరాష్ట్రాలు..
భారత్ జోడో యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లలో ఈ యాత్ర సాగింది. మరోవైపు, భారత్ న్యాయ్ యాత్ర 14 రాష్ట్రాల్లో జరుగుతుంది. అవి మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర.
హైబ్రిడ్ యాత్ర
భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర. యాత్ర ను రాహుల్ గాంధీ పూర్తిగా నడిచే పూర్తి చేశారు. రోజుకు సుమారు 20 కిమీలు నడిచారు. ప్రతీ రోజు యాత్ర ఎక్కడ ముగిస్తే, అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. కానీ, ఈ భారత్ న్యాయ్ యాత్ర ను హైబ్రిడ్ యాత్రగా పేర్కొనవచ్చు. ఇది ప్రధానంగా బస్సు యాత్ర అయినప్పటికీ.. ప్రతీ రోజు మధ్య, మధ్యలో పాదయాత్ర జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల నుంచి స్పందన ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర ఉంటుంది. యాత్ర మార్గంలో అలాగే, చిన్న చిన్న బహిరంగ సభలను నిర్వహిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమవుతారు.
ఎన్ని రోజులు?
భారత్ జోడో యాత్ర ప్రధానంగా కాలినడకన సాగడంతో ఇది పూర్తి కావడానికి 136 రోజులు పట్టింది. భారత్ న్యాయ్ యాత్ర మాత్రం 67 రోజుల్లో పూర్తి అయ్యేలా ప్లాన్ చేశారు. ఈ యాత్ర జనవరి 14 నుంచి మార్చి 20 న వరకు జరుగుతుంది. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల సంరంభం ప్రారంభం కావడానికి ముందే యాత్రను ముగించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.