Himachal results: హిమాచల్ విజయానికి జోడో యాత్ర సాయపడింది: ఖర్గే
08 December 2022, 17:40 IST
- హిమాచల్ ప్రదేశ్‌లో తమకు అధికారం దక్కడానికి రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా దోహదం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
హిమాచల్‌లో పార్టీ గెలిచినందుకు ఖర్గేకు శుభాకాంక్షలు చెబుతున్న సీడబ్ల్యూసీ సభ్యులు రాజీవ్ శుక్లా, తజేంద్ర పాల్ బిట్టు
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర కూడా దోహదపడిందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం అన్నారు. ‘మేము హిమాచల్ ఎన్నికల్లో గెలిచాం. ప్రజలు, మా కార్యకర్తలు, నాయకుల కృషి వల్ల ఈ ఫలితం వచ్చింది. నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా మాకు సహాయపడింది. సోనియా గాంధీ ఆశీస్సులు కూడా మాతో ఉన్నాయి..’ అని ఖర్గే విలేకరులతో అన్నారు.
‘మా పరిశీలకులు, ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు అక్కడికి (హిమాచల్ ప్రదేశ్) వెళ్తున్నారు. గవర్నర్‌ను ఎప్పుడు కలవాలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఎప్పుడు పిలవాలో వారు నిర్ణయిస్తారు’ అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.
గుజరాత్ ఫలితాలపై మాట్లాడుతూ పార్టీ ఓటమిని అంగీకరిస్తోందని చెబుతూ గెలిచిన వారికి అభినందనలు తెలిపారు.
‘ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటమి శాశ్వతం కాదు. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం.. ఆత్మపరిశీలన చేసుకుంటూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం..’ అని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు గానూ కాంగ్రెస్ 39 సీట్లు గెలుచుకుంది. మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) 18 స్థానాల్లో గెలుపొందగా, 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలుపొందగా, ఆప్ ఈ రాష్ట్రంలో ఖాతా తెరవలేకపోయింది. 68 సీట్ల హిమాచల్ అసెంబ్లీలో అధికారం దక్కడానికి 35 సీట్లు వస్తే సరిపోతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికల పనితీరు రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది.
గుజరాత్‌లో బీజేపీ 136 స్థానాల్లో విజయం సాధించి 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందగా, 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలుచుకుంది. గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 92 సీట్లు వస్తే సరిపోతుంది.