తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi At Red Fort: ఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Rahul Gandhi at Red Fort: ఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

HT Telugu Desk HT Telugu

24 December 2022, 19:36 IST

google News
  • Rahul Gandhi at Red Fort: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాద యాత్ర ‘భారత్ జోడో యాత్ర’ శనివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశించింది.

ఎర్ర కోట వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ, చిత్రంలో కమల్ హాసన్, ఖర్గే
ఎర్ర కోట వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ, చిత్రంలో కమల్ హాసన్, ఖర్గే (RajkRaj/HT photo)

ఎర్ర కోట వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ, చిత్రంలో కమల్ హాసన్, ఖర్గే

Bharat Jodo Yatra reaches Delhi: భారత్ జోడో యాత్ర శనివారం హరియాణా నుంచి ఢిల్లీలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎర్ర కోట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు.

Bharat Jodo Yatra reaches Delhi: సోనియా, ప్రియాంక కూడా..

భారత్ జోడో యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన సందర్భంగా.. రాహుల్ గాంధీతో కలిసి ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. సోనియా, ప్రియాంకలతో పాటు, ప్రియాంక గాంధీ భర్త రాబార్ట్ వాద్రా, వారి పిల్లలు కూడా రాహుల్ తో పాటు కలిసి నడిచారు. శనివారం ఉదయం ఢిల్లీలోని ఆశారామ్ చౌక్ వద్ద వారు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ఇప్పుడు ఉన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదని, ఇప్పడు అంబానీ, ఆదానీ ప్రభుత్వం నడుస్తోందని రాహుల్ విమర్శించారు.

Rahul slams Modi, BJP: విద్వేషాన్ని పంచడమే వారి పని

దేశాన్ని హిందు, ముస్లింలుగా విడగొట్టి, విద్వేషాన్ని పెంచడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. ‘‘దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి హిందూ, ముస్లిం అంశాన్ని వారు తెరపైకి తీసుకువస్తారు. నేను ఇప్పటివరకు 2800 కిమీలు నడిచాను. నాకు ఎక్కడా విద్వేషం కనిపించలేదు. కానీ బీజేపీ వారు మాత్రం దేశ ప్రజలను హిందూ, ముస్లింలుగా విడదీసి విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు’’ అని రాహుల్ విమర్శించారు. మోదీ పాలనలో అవినీతి, నిరుద్యోగం ప్రబలాయని, డిగ్రీలు చేసినవారు రోడ్లపై పకోడీలు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi at Red Fort: అమ్మ నుంచి పొందిన ప్రేమ..

తన తల్లి సోనియా గాంధీ నుంచి తాను పొందిన ప్రేమను దేశ ప్రజలకు పంచుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. ఈ కామెంట్ తో పాటు తన తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను రాహుల్ గాంధీ ట్విటర్ లో షేర్ చేశారు. తన అభ్యర్థనపై దేశవ్యాప్తంగా ప్రేమను పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతున్న సమయంలో తొలిసారి ఈ యాత్రలో సోనియా గాంధీ పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం