తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shreyas Srinivas : అతడే ఒక సైన్యం.. సినిమా ట్రెండ్​నే మార్చేసిన ‘శ్రేయాస్​ శ్రీనివాస్​'

Shreyas Srinivas : అతడే ఒక సైన్యం.. సినిమా ట్రెండ్​నే మార్చేసిన ‘శ్రేయాస్​ శ్రీనివాస్​'

Sharath Chitturi HT Telugu

12 July 2022, 11:42 IST

• Shreyas Srinivas : 'మహేష్​ బాబు సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​.. చాలా గ్రాండ్​గా జరిగింది', 'మా ఎన్టీఆర్​ అన్న సినిమా బ్లాక్​ బస్టర్​.. సక్సెస్​ మీట్​​ ఈసారి అదిరిపోతుంది', 'పవన్​ కళ్యాణ్​​ డై హార్డ్​ ఫ్యాన్స్​.. సినిమా ఈవెంట్​ కళకళలాడిపోవాలి', 'ప్రభాస్​ రేంజ్​కి తగ్గట్టు ఈవెంట్లు ఉంటేనే ఖుష్​ అవుతాము'... ఇలా సగటు సినీ ప్రేక్షకుడి నుంచి వీరాభిమానుల వరకు.. ఎదురు చూసేది సినిమా కోసం, దాని చుట్టూ జరిగే 'ఈవెంట్ల' కోసం. ఆ ఈవెంట్లు 'శ్రేయాస్​ మీడియా' చేతిలో ఉంటే.. నిర్మాతలు, అభిమానులకు ప్రశాంతతే. ఒకప్పుడు ఆడియో లాంచ్​ సంప్రదాయానికి నాంది పలికి, ఇప్పుడు ప్రీ రిలీజ్- సక్సెస్​ మీట్​ ఈవెంట్స్​ను పవర్​ఫుల్​గా నిర్వహిస్తూ.. అందరి అంచనాలకు మించి దూసుకెళుతున్న శ్రేయాస్​ మీడియా 'జర్నీ' మీకు తెలుసా? దాని వెనక ఉన్న ఓ 'కల్లూరు కుర్రోడి' సంకల్పం గురించి మీకు తెలియాల్సిందే..
శ్రేయాస్​ శ్రీనివాస్​
శ్రేయాస్​ శ్రీనివాస్​

శ్రేయాస్​ శ్రీనివాస్​

Shreyas Srinivas : ఖమ్మం జిల్లా కల్లూరు యజ్ఞనారాయణపురంలోని ఎర్ర బోయినపల్లి గ్రామం.. శ్రీనివాస్​ స్వస్థలం. నాలుగేళ్లు రెసిడెన్షియల్​ స్కూల్​లో చదువుకున్నారు. శ్రీనివాస్​కు సినిమాలంటే పిచ్చి. కానీ రెసిడెన్షియల్​ స్కూల్​లో ఉన్నవారి కష్టాలు తెలిసినవే కదా! అయినా శ్రీనివాస్​ మాత్రం పట్టువదలలేదు. అవసరమైతే.. స్నేహితులతో కలిసి ఎన్​ఎస్​పీ రోడ్ల మీద లారీలెక్కి థియేటర్లకు వెళ్లేవారు. అలా వార్డెన్​కు దొరికిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఓవైపు చదువు.. మరోవైపు సినిమాలు.. ఇలా ఇంటర్​ వరకు శ్రీనివాస్​ లైఫ్​ సాఫీగా సాగిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఇంటర్​ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్​లో అడుగుపెట్టారు శ్రీనివాస్​. చిక్కడపల్లి అరోరా డిగ్రీ కాలేజీలో చేరారు. అదొక కొత్త ప్రపంచంలా అనిపించింది. తెలుగు మీడియంలోనే చదువుకున్న ఆయనకు ఇంగ్లీష్​ మీడియం పరిచయమైంది అక్కడే. కానీ.. జీవితంలో ఎదగడానికి భాషతో సంబంధం లేదు, మనలో టాలెంట్​ ఉంటే చాలు అని నిరూపించడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు.

అవి డిగ్రీ సెకండ్​ ఇయర్​ రోజులు. జీవితంలో ఏదైనా సాధించాలన్న సంకల్పం ఈ కల్లూరు కుర్రోడిది. ఆ సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే 'ఈవెంట్​ మేనేజ్​మెంట్​.' త్యాగరాయ గాన సభలో 'జాలీ.కామ్​' పేరుతో తొలిసారి ఈవెంట్​ నిర్వహించారు. ఆరోరా కాలేజీ జూనియర్స్​కు ఫ్రెషర్స్​ పార్టీ ఈవెంట్​ అది. ఆ ఈవెంట్​ను కలర్​ఫూల్​గా తీర్చిదిద్దింది, అక్కడికి వచ్చిన వారికి మంచి అనుభూతిని కల్పించింది శ్రీనివాసే.

కెరీర్​లో ప్రతిభను నమ్ముకుంటూ ముందుకెళ్లారు శ్రీనివాస్​. ఒకటి నమ్మితే.. దాన్ని పూర్తిచేసేందుకు ధైర్యంతో అడుగు వేయడం ఈ కల్లూరు కుర్రోడి అలవాటు. డిగ్రీ దశలోనే ఓ యాడ్​ ఏజెన్సీని స్థాపించారు. టీవీ ఛానెళ్లల్లో 'స్క్రోలింగ్​' అనే స్లగ్​ను ఏర్పాటు చేసి అడ్వర్టైజింగ్​లో కొత్త శకానికి నాంది పలికారు. 'నీకు అనుభవం లేదు, నువ్వేం చేయగలవు? నిన్ను నమ్మి డబ్బులు పెట్టలేము,' అన్న మాటలకు.. సొంతంగా యాడ్స్​ తీసి చూపించి, ప్రశంసలు అందుకున్నారు.

చిరంజీవి, నాగార్జున, రవితేజలతో శ్రేయాస్​ శ్రీనివాస్​

శ్రీనివాస్​ తీసిన యాడ్స్​లో 'బిగ్​ సీ' యాడ్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ రోజు.. సినీ నటి, నిర్మాత ఛార్మీతో కలిసి బిగ్​ సీ కోసం యాడ్​ తీశారు శ్రీనివాస్​. ఆ యాడ్​ చాలా పాప్యులర్​ అయ్యింది. అప్పటి నుంచి బిగ్​ సీ యాడ్​లన్నీ శ్రీనివాస్​వే! అలా బిగ్​ సీతో విడతీయలేని స్నేహాన్ని, అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.

కల్లూరు కుర్రోడు.. టు 'శ్రేయాస్​ శ్రీనివాస్​'

Shreyas media founder : హీరోలు, హీరోయిన్లకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్​ ఉంటుంది. అందుకే అనేక సంస్థలు తమ బ్రాండ్ల ప్రమోషన్ల కోసం వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 'అసలు వారి చుట్టూ తిరగడం ఎందుకు? మనమే వెళ్లి సినీ ఇండస్ట్రీలో కూర్చుంటే?' అన్న శ్రీనివాస్​ ఆలోచనకు ప్రతిరూపమే.. 'శ్రేయాస్ మీడియా​ గ్రూప్​ ఈవెంట్​ మేనేజ్​మెంట్​.'

ట్రైలర్​ లాంచ్​లు, ప్రీ రిలీజ్​ ఈవెంట్లు, పోస్ట్​ రిలీజ్​ సక్సెస్​ పార్టీలు జోరుగా సాగుతున్న కాలం ఇది. కానీ నిన్న, మొన్నటి వరకు సినిమాకి ముందు కేవలం ఆడియో ఫంక్షన్లే ఉండేవి. అభిమానుల కోలాహలం మధ్య ఆడియో ఫంక్షన్లు జరిగేవి. 2008 ముందు వరకు కూడా లేని ఆడియో ఫంక్షన్​ సంప్రదాయానికి నాంది పలికింది కూడా శ్రీనివాసే. అప్పటివరకు చిన్న బ్యానర్ల కింద, నిర్మాతల కార్యాలయాల్లో సింపుల్​గా జరిగిపోయిన ఆడియో ఫంక్షన్లకు 'గ్రాండ్​' లుక్​ తెచ్చింది శ్రేయాస్​ మీడియానే.

సమంతతో శ్రేయాస్​ శ్రీనివాస్​

2008లో 'జల్సా' సినిమాతో ఆడియో లాంచ్​ ఈవెంట్​కు శ్రీకారం చుట్టింది శ్రేయాస్​ మీడియా. నిర్మాత అల్లు అరవింద్​ ప్రోత్సాహంతో ఆ ఈవెంట్​ బ్లాక్​బస్టర్​గా మారింది. అక్కడి నుంచి శ్రేయాస్​ మీడియా వెనక్కి తిరిగి చూసుకోలేదు! జల్సా నుంచి ఇప్పటివరకు 1,800కుపైగా ఈవెంట్స్​ను నిర్వహించింది. 1,200 మూవీ ప్రొమోషన్ల బాధ్యతను చేపట్టింది. అలా.. ఆ కల్లూరు కుర్రోడు.. 'శ్రేయాస్​ శ్రీనివాస్​'గా పేరు సంపాదించుకున్నారు.

శ్రీనివాస్ ఆలోచనకు ఉన్న పవర్​ను తెలుసుకోవాలంటే..​ శ్రేయాస్​ మీడియా బిజినెస్​ మోడల్​ గురించి చెప్పుకోవాల్సిందే. బ్రాండ్​ ప్రొమోట్​ చేసుకునే సంస్థలు, సినిమా ప్రొమోషన్ల కోసం ఎదురుచూస్తున్న హీరో, హీరోయిన్లను 'ఈవెంట్​' రూపంలో ఒక్క చోటకు చేర్చింది శ్రేయాస్​ మీడియా. ఈ ఫార్మాట్​ అంతకు ముందు వరకు ఎక్కడా లేదు. శ్రేయాస్​ మీడియాతో అసోసియేట్​ అయితే.. టీవీ, పేపర్​, సోషల్​ మీడియా.. ఇలా అన్నింట్లోనూ ఆ ఈవెంట్లు హిట్​ అవుతాయి అన్న నమ్మకాన్ని కల్పించారు శ్రీనివాస్​.

ఈవెంట్ల నిర్వహణ కోసం కొన్ని కేటగిరీలు ఉంటాయి. బడా హీరోల చిత్రాల ఈవెంట్లను శ్రేయాస్​ మీడియా ఉచితంగా చేసిపెడుతుంది. ఈవెంట్​కు తగ్గట్టు స్పాన్సర్లను తీసుకొస్తుంది. ఆ ఈవెంట్లకు స్పాన్సర్​ చేసిన వారికి.. కొన్ని రోజుల్లోనే 10కోట్ల మందికి రీచ్​ వస్తుంది. 'ఎంత ఎక్కువ మందికి రీచ్​ అయితే.. అంత లాభం,' అని సాగిపోతున్న ఈ కాలంలో.. ఇంత కన్నా కావాల్సింది ఏముంటుంది? అలా కేటగిరీలు, హీరోల ఫేమ్​ బట్టి.. నిర్మాతలు, స్మాన్సర్ల నుంచి డబ్బులు సేకరించి ఈవెంట్లు నిర్వహిస్తుంది శ్రేయాస్​ మీడియా.

కొత్త టాలెంట్​కు ప్రోత్సాహం..

Shreyas media : టాలెంట్​కు గుర్తింపు లభిస్తే.. అది ఎలాంటి వండర్స్​ సృష్టిస్తుందనేది శ్రేయాస్​ శ్రీనివాస్​కు తెలుసు. అందుకు ఆయనే నిదర్శనం. అందుకే కొత్త టాలెంట్​ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 'గుడ్​ సినిమా గ్రూప్​' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'ఈరోజుల్లో..' సినిమాతో ప్రముఖ దర్శకుడు మారుతీని పరిచయం చేశారు. ఇప్పటివరకు తొమ్మిది సినిమాలను నిర్మించారు.

దర్శకుడు మారుతీతో శ్రేయాస్​ శ్రీనివాస్​

'రెగ్యులర్​ ఫార్మాట్​, కామెడీ, ఫ్యామిలీ చిత్రాలు ఓటీటీలో చాలా వస్తున్నాయి. ప్రజల ఆసక్తులు మారిపోయాయి. ఇప్పుడు ఆర్​ఆర్​ఆర్​, కేజీఎఫ్​, విక్రమ్​ వంటి సినిమాలు క్రేజ్​ని సంపాదించుకున్నాయి. అందుకే.. ఇన్నోవేటివ్​ స్టోరీలు, ఔట్​ ఆఫ్​ ది బాక్స్​ కాన్సెప్ట్​ ఉండే స్టోరీలతో యంగ్​ టాలెంట్​ ముందుకొస్తే.. వాటిని నిర్మించేందుకు సిద్ధం,' అని అంటున్నారు శ్రేయాస్​ శ్రీనివాస్​.

కష్టపడితేనే 'సక్సెస్'​..

ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు సహజమే. అదేంటో.. జీవితంలో సక్సెస్​ సాధించాలన్న సంకల్పంతో ఉన్న వారిని.. కాలం ఇంకాస్త ఎక్కువే పరీక్షిస్తుంది! ఆ కష్టాలను ఎదురీదితేనే 'సక్సెస్​'ను అందిస్తుంది. శ్రీనివాస్​ కూడా.. తన కెరీర్​లో ఎన్నో కష్టాలు చూశారు​. వాటిని జయిస్తూ.. తన సక్సెస్​ స్టోరీని తానే రాసుకున్నారు.

డిగ్రీ రోజుల్లో త్యాగరాయ గాన సభలో శ్రీనివాస్​ నిర్వహించిన తొలి ఈవెంట్​కు దాదాపు బ్రేక్​ పడింది! కాసేపట్లో ఈవెంట్​ అనగా.. ఒక్కసారిగా కరెంట్​ పోయింది. రూ. 3వేల రెంట్​ బ్యాలెన్స్​ ఇస్తేనే ఈవెంట్​ జరుగుతుందని తేల్చిచెప్పేశారు. శ్రీనివాస్​ చేతుల్లో డబ్బులు లేవు. ఈ సమయంలో చాలా మంది చేతులెత్తేస్తారు. కానీ సక్సెస్​ రుచి చూడాలనుకే వాళ్లు మాత్రం సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని అనుకుంటారు. తన బంగారం గొలుసును తాకట్టు పెట్టి, అప్పటికప్పుడు డబ్బులు తెచ్చి, ఆ ఈవెంట్​ను గ్రాండ్​ సక్సెస్​ చేశారు శ్రీనివాస్​. ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. చాలా కాలం వరకు రోల్డు గోల్డు నెక్లెస్​నే వేసుకున్నారు.

టాలీవుడ్​ ప్రముఖ హీరోలు మెచ్చిన వ్యక్తి.. శ్రేయాస్​ శ్రీనివాస్​

“జీవితంలో వచ్చేవి పోయేవి చాలానే ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు. కానీ నీ జీవితంలో.. నీ మీద నీకున్న నమ్మకం, నలుగురితో నువ్వు ఉండే తీరు, పంచే ప్రేమ, మాత్రమే శాశ్వతం..” అంటూ తన ఆలోచనలను హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుతో పంచుకున్నారు శ్రేయాస్​ శ్రీనివాస్​.

సినిమా తీయడం అంటే చాలా కష్టమైన విషయం. ఆ విషయం తెలిసి కూడా అడుగుపెట్టారు శ్రీనివాస్​. 'ఈ రోజుల్లో..' సినిమా షూటింగ్​ దాదాపు రెండేళ్లు జరిగింది. డబ్బులు ఉన్నప్పుడల్లా షూటింగ్​ చేసేవారు. కొన్నిసార్లు డబ్బులు ఉండేవి కాదు. ఎట్టకేలకు సినిమా రెడీ ఆయ్యింది. అప్పటికే శ్రీనివాస్​కు చాలా అప్పులు ఉన్నాయి. శాటిలైట్​ రైట్స్​ సమస్యలు కూడా ఉన్నాయి.

'కష్టపడి చేసిన సినిమాకు నెగిటివ్​ టాక్​ వస్తే ఎలా?' అన్న ఆలోచనలో పడ్డ శ్రీనివాస్​కు ఓ స్నేహితుడు ధైర్యం చెప్పాడు. 'నీ టాలెంట్​ని నమ్ముకో.. నువ్వు సక్సెస్​ అవుతావు,' అని భుజం తట్టాడు. శ్రీనివాస్​ మనసులో కాస్త ప్రశాంతత. రిలీజ్​కి ముందు రోజు ఫోన్​ ఆఫ్​ చేసి పడుకున్నారు. ఉదయం 10:30కు ఫోన్​ ఆన్​ చేస్తే.. 'గోకుల్​ థియేటర్​ దగ్గర ఈ రోజుల్లో సినిమాను బ్లాక్​లో టికెట్లు అమ్ముతున్నారు,' అని ఫ్రెండ్​ ఫోన్​ చేశారు. శ్రీనివాస్​కు రెట్టింపు ఆనందం లభించింది.

ప్రముఖ హీరోయిన్స్​తో శ్రేయాస్​ శ్రీనివాస్​

కొవిడ్​తో మరో కష్టం ఎదురైంది. సినిమాలు విడుదల కాలేదు. బ్రాండ్ల ప్రొమోషన్లు జరగలేదు. 'ఇది ముగింపు కాదు. మనకి మళ్లీ టైమ్​ వస్తుంది,' అని సహనంతో నిరీక్షించారు శ్రీనివాస్​. కొవిడ్​ తర్వాత సినిమాల ప్రవాహం మొదలైంది. సినిమాలకు.. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలలో క్రేజ్​ రెట్టింపు అయ్యింది. ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన శ్రీనివాస్​.. అందుకు తగ్గ ఆయుధాలతో సిద్ధమయ్యారు. శ్రేయాస్​ మీడియా బ్రాండ్​​ను మరో శిఖరానికి చేర్చేందుకు వ్యూహాలు రచించారు.

పాన్​ ఇండియా ప్రణాళికలు..

Shreyas Srinavas events : ఇప్పుడు పాన్​ ఇండియా ట్రెండ్​ నడుస్తోంది. ప్రజల ఆలోచనా ధోరణ కూడా మారుతోంది. అందుకు తగ్గట్టుగానే శ్రేయాస్​ శ్రీనివాస్​ సన్నద్ధమవుతున్నారు. ఇప్పుటివరకు తెలుగు, కర్ణాటకలో ఈవెంట్లు చేయగా.. ఇప్పుడు 'శ్రేయాస్'​ను దేశవ్యాప్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దసరా, దీపావళి నాటికి ఇండియా మొత్తం మీద కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్​టీఆర్​, కళ్యాన్​ రామ్​లతో..

"ఈవెంట్లను ఆల్​ ఇండియా స్థాయికి తీసుకెళ్లాలి. ఇది ఫ్యూచరిస్టిక్​ మోడల్​. ఒక్కప్పుడు సింగింగ్​, డ్యాన్సింగ్​ ఉండేవి. ఇప్పుడు అందరి ఆలోచనలు మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా శ్రేయాస్​ కూడా మారుతుంది. దుబాయ్​లో లైవ్​ కాన్సర్ట్​ ప్లాన్​ చేస్తున్నాము. ప్రముఖ సింగర్స్​ అందరు పాల్గొంటారు. శ్రేయాస్​ మీడియా మ్యూజిక్​ అవార్డు కూడా తీసుకొస్తున్నాము. ప్రతి ఏడాది ఆవార్డులు ఇచ్చే విధంగా ప్లాన్​ డిజైన్​ చేస్తున్నాము. రానున్న ఐదేళ్ల ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి. 2027 నాటికి సంస్థ టర్నోవర్ రూ. 1300 కోట్లకు తీసుకెళతాము. 'ఎంటర్​టైన్​మెంట్​ విల్​ నెవర్​ డై​.. ఓన్లీ ది మీడియం విల్​ ఛేంజ్​' అని తన శైలిలో చెప్పుకొచ్చారు శ్రేయాస్​ శ్రీనివాస్​.

'శ్రీనివాస్​ ఉంటే.. ఇబ్బందులు ఉండవు..'

ఈ ప్రయాణంలో ఎందరినో కలిశారు శ్రీనివాస్​. వారందరితోనూ ఆయనకు మంచి స్నేహం ఉంది.

'చిత్రం' సినిమాతో హిట్​ కొట్టి, యువతలో ఉదయ్​ కిరణ్​ మంచి గుర్తింపు పొందిన రోజులు అవి. త్యాగరాయ గాన సభలో ఈవెంట్​కు ఆయన్ని పిలుద్దామని శ్రీనివాస్​ అనుకున్నారు. వారిద్దరు ఒకప్పుడు 'ట్యూషన్​'మేట్స్​. శ్రీనివాస్​ అంటే ఇష్టంతో నో చెప్పకుండా ఆ ఈవెంట్​కు వెళ్లారు ఉదయ్​ కిరణ్​. అలా తన వ్యక్తిత్వంతోనూ ఎందరి నుంచో ప్రశంసలు పొందారు శ్రేయాస్​ శ్రీనివాస్​.

ఎల్​బీ స్టేడియంలో 'భరత్​ అనే నేను' ఈవెంట్​ జరిగింది. ఎన్​టీఆర్​- మహేష్​ బాబు ఒకే స్టేజీపై కనిపించారు. ఆ ఈవెంట్​కు లక్షలమంది అభిమానులు తరలివెళ్లారు. అంత పెద్ద ఈవెంట్​ను చాలా సింపుల్​గా పూర్తి చేసి, మహేష్​ బాబు ప్రశంసలు అందుకున్నారు శ్రీనివాస్​.

మహేష్​ బాబుతో శ్రేయాస్​ శ్రీనివాస్​

Shreyas media group : అల వైకుంఠపురములో ఈవెంట్​ సందర్భంగా.. శ్రీనివాస్​ గురించి దర్శకుడు త్రివిక్రమ్​ ప్రస్తావించారు. 'జల్సా నుంచి శ్రీనివాస్​ నాకు తెలుసు. అన్నింటిని సొంత మనిషిలాగా చూసుకుంటారు,' అని అన్నారు.

జీవితంలో కొంత సక్సెస్​ కనిపించేసరికి.. 'చాలా సాధించేశాము' అన్న భావనతో ఉంటారు. కానీ అతి తక్కువ కాలంలోనే, సినీ ఇండస్ట్రీలో తనకుంటా ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న శ్రేయాస్​ శ్రీనివాస్​ మాత్రం.. 'సాధించాల్సింది ఇంకా చాలా ఉంది,' అని అంటున్నారు.

‘నేను ఈవెంట్​ చేస్తే కొన్ని వేల మంది భోజనం చేసి కడుపు నింపుకుంటారు. అలా.. లక్షలమందికి నేను ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి. ఆ సంకల్పంతోనే పనిచేస్తున్నాను. నిత్యం అన్నదానాలు చేయాలి. అప్పుడే జీవితంలో నేను నిజంగా సక్సెస్​ అయినట్టు. నేను దెవుడిని కోరుకునేది కూడా ఇదే,’ అంటున్న 39ఏళ్ల శ్రీనివాస్​ లైఫ్​ స్టోరీ స్ఫూర్తితో మనం కూడా 'సక్సెస్​' అవ్వాలి.. నలుగురికి ఉపయోగపడాలి..!

టాపిక్

తదుపరి వ్యాసం