తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vector Systems : ఆకలి పోరాటం.. ఆగని ప్రయత్నం- 'వెక్టర్​'తో శేషారెడ్డి విక్టరి..!

Vector systems : ఆకలి పోరాటం.. ఆగని ప్రయత్నం- 'వెక్టర్​'తో శేషారెడ్డి విక్టరి..!

Sharath Chitturi HT Telugu

04 July 2022, 16:07 IST

• Vector systems : ఆయన ఓ సామాన్యుడు. ఆయనది ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. ఎన్నో కష్టాలు.. వాటికి మించి.. మరెన్నో ఆశలు! 'కష్టం వస్తే రానివ్వు.. నేను పోరాడతాను' అన్న మనస్తత్వం ఆయనది. ఆ సంకల్పమే ఆయనను అంచెలంచెలుగా ఎదిగేందుకు దోహదపడింది. తిండి లేని రోజుల నుంచి.. సొంతంగా సంస్థను స్థాపించి, నలుగురికి అండగా నిలిచేందుకు ఉపయోగపడింది. హోమ్​ థియేటర్స్​, హోమ్​ ఆటోమేషన్​ రంగంలో బడా కంపెనీలను ధీటుగా ఎదుర్కొని నిలదొక్కుకునే ధైర్యాన్ని ఇచ్చింది. ఇదీ.. 'వెక్టర్​ సిస్టమ్స్​' ఎండీ ముడిమెల వెంకట శేషారెడ్డి కథ. జీవితంలో సక్సెస్​ రుచి చూడాలని తహతహలాడుతున్న యువతకు తెలియాల్సిన కథ ఇది.
వెక్టర్​ సిస్టమ్స్​ ఎండీ శేషారెడ్డి
వెక్టర్​ సిస్టమ్స్​ ఎండీ శేషారెడ్డి (vector systems)

వెక్టర్​ సిస్టమ్స్​ ఎండీ శేషారెడ్డి

Vector systems : కర్మూలు జిల్లా నంద్యాలకు సమీపంలో ఉన్న గుంతనాలలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు శేషా రెడ్డి. ఆయన తండ్రి పేరు గోపాల్​ రెడ్డి. తల్లి ఈశ్వరమ్మ. గోపాల్​ రెడ్డి ఓ సన్నకారు రైతు. శేషారెడ్డికి ఒక అన్న, ఇద్దరు అక్కలు. తండ్రి రైతు కావడంతో ఆ కుటుంబం ఆశలన్నీ వరుణుడిపైనే ఉండేవి. వర్షాలు పడితేనే పంట చేతికొచ్చేది. లేదంటే జీవితం సాగించడం కష్టమే.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

పుట్టిన చోట తగిన సౌకర్యాలు లేకపోవడంతో శేషారెడ్డి విద్యాభ్యాసం.. వివిధ ప్రాంతాల్లో జరిగింది. 1వ తరగతి వరకు గుంతనాలలోనే చదువుకున్న శేషారెడ్డి.. ఆ తర్వాత 8వ తరగతి వరకు నంద్యాలలోని బీసీ హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించారు. ఇక 9,10 తరగతులు నందికొట్కూరు వద్ద ఉన్న ప్రాతకోటలో పూర్తుచేశారు. అక్కడి నుంచి బనగానపల్లెలో పాలిటెక్నిక్​ కళాశాలలో చేరి డిప్లమా చేశారు.

వెక్టర్​ సిస్టమ్స్​ రూపొందించిన హోమ్​ థియేటర్​

ఈసెట్​ ప్రవేశ పరీక్ష రాయాలనుకున్న శేషారెడ్డిని ఆయన తండ్రి ప్రోత్సహించలేదు. కోచింగ్​కు అప్పట్లో రూ. 8వేలు అయ్యేది. అంత డబ్బు తన దగ్గర లేదని తేల్చిచెప్పేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శేషారెడ్డికి పేకాట అలవాటైంది. అది తెలుసుకున్న గోపాల్​ రెడ్డి.. శేషారెడ్డిని చెన్నైకి తీసుకెళ్లారు. తన సోదరి ఇంట్లో ఉంచాలని నిర్ణయించారు. కానీ తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకున్న శేషారెడ్డి..తండ్రిని బస్సు ఎక్కించి.. చెన్నై నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. తన స్నేహితుడు గోవిందరాజు వద్దకు వెళ్లి.. అద్దె గదిలో ఉండటం మొదలుపెట్టారు.

ఎలక్ట్రానిక్​ పరికరాలపై ఆసక్తి ఉన్న శేషారెడ్డి.. టీవీలు రిపేరు చేసే దుకాణంలో పనికి చేరారు. ఒక్క టీవీ రిపేరు చేస్తే రూ. 50 ఇచ్చేవాళ్లు. అలా.. తొలి సంపాదన అందుకున్నారు శేషారెడ్డి. కొన్ని రోజుల తర్వాత.. నెలకు రూ. 1,200 జీతంతో బీపీఎల్​ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్​ సూపర్​వైజర్​గా చేరారు. కానీ తనకు సూట్​ కాదని అర్థమై.. ఒక్క రోజులోనే వదిలేశారు.

వెక్టర్​ సిస్టమ్స్​ రూపొందించిన హోమ్​ థియేటర్​

కొన్నాళ్లకు రూ. 150 వేతనంతో కొరియర్​ బాయ్​గా చేరారు శేషారెడ్డి. ఓరోజు అక్కడి యజమాని శేషారెడ్డిని చూశారు. 'అసలు ఎందుకు ఇక్కడ చేరావు' అని అడగ్గా.. 'సిటీని చూడటానికి' అని జవాబిచ్చారు శేషారెడ్డి. అలా మొదలైన సంభాషణతో శేషారెడ్డికి ఎలక్ట్రానిక్స్​పై మంచి పట్టు ఉందని ఆ యజమాని గ్రహించారు. తన సోదరుడి ఆడియో వీడియో ఇంటిగ్రేషన్​​ వ్యాపారం చేస్తున్నాడని, అందులో చేరాలని శేషారెడ్డిని అభ్యర్థించారు. అలా.. శేషారెడ్డి కెరీర్​ ప్రారంభమైంది. అక్కడ ప్రొజెక్టర్లను రిపేరు చేసేవారు శేషారెడ్డి. రూ. 750 వేతనంతో పనిలోకి చేరిన శేషారెడ్డి.. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి స్వయంగా ఓ సంస్థను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు.

శ్రమే పెట్టుపడి..

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. తనకు వచ్చిన, నచ్చిన విద్యనే నమ్ముకుని ఎదిగారు శేషారెడ్డి. వాస్తవానికి ఆయనకు వచ్చే రూ. 750 జీతంలో.. సగం అద్దెకే వెళ్లిపోయేది. మిగిలిన దానితో నెల మొత్తం గడపాలి. అందుకే ఇంటి నుంచి ఆఫీసుకు రోజు 5కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారు. సమీపంలోని బేకరీలో తక్కువ ధరకు బ్రెడ్​ కొని తినేవారు. కడుపు నిండకపోతే.. నీళ్లు తాగి పడుకునేవారు.

వెక్టర్​ సిస్టమ్స్​ రూపొందించిన హోమ్​ థియేటర్​

"ఆకలి బాధ అంటే ఏంటో నాకు తెలుసు. చాలా రోజులు ఏడ్చాను. కానీ ఎప్పుడు వెనక్కి తిరిగి వెళ్లిపోవాలన్న ఆలోచన నాకు రాలేదు. నా దగ్గర విద్య ఉంది. రిపేరింగ్​ పని బాగా చేయగలను. నాకు వచ్చిన విద్య నాకు అన్నం పెడుతుందన్నది నా ధీమా. రెండేళ్లు సరిగ్గా తినలేదు. అయినా కుటుంబాన్ని, స్నేహితులను ఒక్కసారి కూడా సాయం అడగలేదు," అని శేషారెడ్డి ఆనాటి రోజులను నెమరవేసుకున్నారు.

శేషారెడ్డి శ్రమ ఫలించింది. నాలుగేళ్లల్లో ఆయన జీతం రూ. 22వేలకు చేరింది. ఆకలి కష్టాలు తగ్గాయి. ఓసారి ఇంజనీరింగ్​ కళాశాలలో రిపేర్లు చేయాల్సి వస్తే వెళ్లారు శేషారెడ్డి. అతి తక్కువ టైమ్​లో పని ముగించేసిన ఆయన్ని చూసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్​ మెచ్చుకున్నారు. శేషారెడ్డికి మంచి ఆఫర్​ ఇచ్చారు. ఆయన సాయంతో అదే కాలేజీలో ఇంజినీరింగ్​ పూర్తిచేశారు శేషారెడ్డి.

'వెక్టర్'​తో విక్టరీ..

బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వచ్చిన శేషారెడ్డి ఈసీఐఎల్​లో ప్రాజెక్టు మొదలుపెట్టారు. అదే సమయంలో ఎంబెడ్డెడ్​ సిస్టమ్స్​ మీద కోచింగ్​ తీసుకున్నారు. ఇక అవకాశాలు శేషారెడ్డిని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రొజెక్టర్లను రీపేరు చేసేవారు ఆరోజుల్లో చాలా తక్కువే. పైగా శేషారెడ్డి తన నైపుణ్యంతో తక్కువ సమయంలోనే ఆ పనిని ముగించేసేవారు. ఫలితంగా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు.

వెక్టర్​ సిస్టమ్స్​ రూపొందించిన హోమ్​ థియేటర్​

2000 డిసెంబర్​లో.. జూబ్లీహిల్స్​ రోడ్​ నెంబర్ 10లో సొంతంగా ఓ కార్యాలయాన్ని స్థాపించారు శేషారెడ్డి. అదే 'వెక్టర్​ సిస్టమ్స్​'. ఇక శేషారెడ్డి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. వ్యాపారాన్ని విస్తరిస్తూ ముందుకు సాగారు. 2007లో బెంగళూరులోని బ్రిగేడ్​ రోడ్​లో మరో కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కినేని అమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక 2008లో జూబ్లీహిల్స్​లో అతిపెద్ద ఎక్స్​పీరియెన్స్​ సెంటర్​ను ప్రారంభించారు శేషారెడ్డి. స్నేహితుడు మోసం చేయడంతో డబ్బులు పోగొట్టుకున్నా, ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. వ్యాపారానికి అన్ని తానై నిలిచారు. ఆయనకు తోడుగా మరో 40మంది ఉద్యోగులు నడిచారు.

అలా మొదలైన 'వెక్టర్​' స్టోరీ.. సక్సెస్​ఫుల్​గా సాగిపోతోంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు కార్పొరేట్​, సినీ, రాజకీయ ప్రముఖలెందరో వెక్టర్​ సంస్థకు కష్టమర్లు. రూ. కోట్లు విలువ చేసే హోమ్​ థియేటర్లను నిర్మించి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు శేషారెడ్డి.

అక్కినేని నాగార్జునతో శేషారెడ్డికి ఉన్న పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2004లో నాగార్జున, శేషారెడ్డి ఒకే జిమ్​కు వెళ్లేవారు. ఓరోజు.. అక్కడ మ్యూజిక్​ సిస్టమ్​ సరిగ్గా పనిచేయలేదు. జిమ్​ నిర్వాహకులపై నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పుడు అక్కడే ఉన్న శేషారెడ్డి.. నాగార్జున ముందే క్షణాల్లో దానిని రిపేర్​ చేసేశారు. ఆ తర్వాత.. నాగార్జున ఇంట్లో హోమ్​ థియేటర్​ను నిర్మించింది శేషారెడ్డి బృందం. శేషారెడ్డి పనితీరుకు మెచ్చి.. కోట్​ చేసిన దాని కంటే అదనంగా డబ్బులు చెల్లించారు నాగార్జున.

కొవిడ్​ను తట్టుకుని, కష్టాలను జయించి..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ సృష్టించిన అలజడుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో వ్యాపారాలు మూతపడిపోయాయి. ఎన్నో ఆశలు ఛిద్రమైపోయాయి. కానీ కష్టాలను ఎదురీదిన శేషారెడ్డి.. కొవిడ్​ సంక్షోభాన్ని సైతం జయించారు. కొవిడ్​తో జరిగిన నష్టం గురించి బాధపడకుండా.. సంక్షోభంలో నుంచి పుట్టుకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

వెక్టర్​ సిస్టమ్స్​ రూపొందించిన హోమ్​ థియేటర్​

కొవిడ్​తో ఇంట్లోనే ఉండిపోయిన కుటుంబాల జీవనశైలిలో మార్పులు కనిపించాయి. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే టీవీలు చూసేందుకు మొగ్గుచూపుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే ఓటీటీకి గిరాకీ పెరిగింది. హోమ్​ థియేటర్లకు డిమాండ్​ పెరగడంతో శేషారెడ్డి జోరును పెంచారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు, తక్కువ సమయంలోనే హోమ్​ థియేటర్లు, మ్యూజిక్​ సిస్టమ్స్​ నిర్మించి ఇచ్చేవారు. గేటెడ్​ కమ్యూనిటీల్లో కూడా హోమ్​ థియేటర్లు నిర్మించారు.

ట్రెండ్​కి తగ్గట్టు సంస్థలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ల్యూట్రాన్​ అనే అమెరికా కంపెనీతో శేషారెడ్డి టైఅప్​ అయ్యారు. హోమ్​ ఆటోమేషన్​, బిల్డింగ్​ మేనేజమెంట్​ సొల్యుషన్స్​లోనూ సంస్థ చురుకుగా ముందుకెళుతోంది.

వెక్టర్​ సిస్టమ్స్​తో పాటు ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీని సైతం కొనుగోలు చేశారు శేషారెడ్డి. ప్రస్తుతం ఆ ఐఓటీ సంస్థకు డైరక్టర్​గా కొనసాగుతున్నారు. రైతన్నలకు ఉపయోగపడే విధంగా, స్మార్ట్​ ఫార్మింగ్​ కోసం పరికరాలను రూపొందిస్తోంది ఆ సంస్థ.

శ్రమతోనే సక్సెస్​ వస్తుందని చెప్పేందుకు శేషారెడ్డి జీవితమే మంచి ఉదాహరణ. ఇదీ 'వెక్టర్​ సిస్టమ్స్​'.. ఇదీ 45ఏళ్ల శేషారెడ్డి సక్సెస్​ స్టోరీ..!

టాపిక్

తదుపరి వ్యాసం