ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో ఫోన్లు వాడొద్దు.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు
16 March 2022, 6:46 IST
- ప్రభుత్వ ఆఫీసుల్లో సెల్ఫోన్ల వాడకంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. పని వేళళ్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని తమిళనాడు సర్కార్‌కు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సెల్ ఫోన్లు వాడొద్దు - మద్రాస్ హైకోర్టు
వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు.. సెల్ఫోన్లను ఉపయోగించకూడాదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు సర్కార్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణియన్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వల్లో పేర్కొన్నారు. దీనికి కచ్చితమైన నియమ, నిబంధనల్ని రూపొందించి అమల్లోకి తేవాలంది.
కేసు వివరాలు...
ఓ ఆరోగ్య మండల కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న ఓ మహిళ పని వేళల్లో సెల్‌ఫోన్ వాడుతున్నట్లు, వీడియోలు చూస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ చర్యలను సవాల్ చేస్తూ సదరు మహిళ.. హైకోర్టును ఆశ్రయించారు. విధుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ వినియోగం పెరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని స్వాగతించదగింది కాదంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత అవసరాలకు మొబైళ్లను అనుమతించొద్దని పేర్కొంది. ఏదైనా అత్యవసరమైతే తమ పై అధికారి అనుమతి తీసుకుని సెల్‌లో మాట్లాడొచ్చని తెలిపింది.
విధుల్లో ఉన్నప్పుడు తోటి ఉద్యోగులు, కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.. కార్యాలయ అవసరాల కోసం ప్రత్యేక సెల్‌ఫోన్, టెలిఫోన్ ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సెల్ వాడకంపై కొత్త రూల్స్‌ను రూపొందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించారు. నాలుగు వారాల్లోపు వాటిని ఆచరణలోకి తేవాలని ఉత్తర్వులిచ్చారు.