Philippines earthquake | ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం
27 July 2022, 22:23 IST
ఫిలిప్పైన్స్‌ను బుధవారం భారీ భూకంపం వణికించింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి భవనాలు చిగురుటాకుల్లా వణికాయి. ఈ భూకంప ప్రభావంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
భూకంపంతో ధ్వంసమైన భవనం
Philippines earthquake | ఉత్తర ఫిలిప్పైన్స్ లోని లుజాన్ ద్వీపంపై ఈ భూకంపం ప్రభావం తీవ్రంగా పడింది. భూకంప లేఖినిపై 7.1 పాయింట్ల తీవ్రతతో.. దాదాపు 30 సెకన్ల పాటు వచ్చిన ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 64 మంది గాయాలపాలయ్యారు.
Philippines earthquake | లుజాన్ ద్వీపంపై..
లుజాన్ ద్వీపంపై ఈ భూకంపం ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ దాదాపు 173 భవనాలు ధ్వంసమయ్యాయి. 58 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ద్వీపం భూకంప కేంద్రం నుంచి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఉండడంతో ఇక్కడ విధ్వంసం తీవ్రంగా ఉంది. ప్రధాన భూకంపం తరువాత కూడా చాలా సేపు భూ కంపనాలు కొనసాగాయి. దాదాపు 200 కంపనాలను గుర్తించినట్లు సిస్మాలజీ విభాగం ప్రకటించింది. భూకంపం ప్రభావం దేశ రాజధాని మనీలాపై కూడా పడింది. అక్కడ కొద్ది గంటల పాటు మెట్రో సేవలను నిలిపేశారు. కొన్ని భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆబ్రా రాష్ట్రంలో ఒక ఆసుపత్రి పాక్షికంగా కూలిపోయింది. దాంతో పేషెంట్లను, సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. శిధిలాల కింద చిక్కుకుపోయి బెంగ్వెట్ రాష్ట్రంలో ఇద్దరు, అబ్రాలో ఒకరు, కళింగలో ఒకరు, కాగయాన్‌లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
Philippines earthquake | భూకంపాలు సాధారణం
ఫిలిప్పైన్స్ లో భూకంపాలు సర్వ సాధారణం. అయితే, 7 పాయింట్ల తీవ్రతను మించి భూకంపాలు వచ్చినప్పుడు విధ్వంసం ఎక్కువగా ఉంటుంది. ఫిలిప్పైన్స్ భౌగోళికంగా భూకంపాలు ఎక్కువగా చోటు చేసుకునే `పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్` ప్రాంతంలో ఉంది. పసిఫిక్ మహా సముద్ర తీరంలో ఉన్న ఫిలిప్పైన్స్‌లో భూకంపాలే కాకుండా భారీ తుపాన్లైన టైఫూన్లు కూడా సాధారణమే. సంవత్సరానికి సగటున 20 టైఫూన్లు వస్తుంటాయి.