UCC: ‘ఉమ్మడి పౌర స్మృతి’పై బీజేపీ అనుకున్నది సాధించగలదా?
29 June 2023, 17:24 IST
- Uniform Civil Code: 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. వివాదాస్పద ‘ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఈ వివాదాస్పద అంశంపై చట్టం చేయగల సంఖ్యాబలం పార్లమెంట్లో బీజేపీకి ఉన్నదా? అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.
ప్రతీకాత్మక చిత్రం
Uniform Civil Code: 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. వివాదాస్పద ‘ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code)’ అంశాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఈ వివాదాస్పద అంశంపై చట్టం చేయగల సంఖ్యాబలం పార్లమెంట్లో బీజేపీకి ఉన్నదా? అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.
మూడో డిమాండ్ ను కూడా నెరవేరుస్తుందా?
మొదట్నుంచీ బీజేపీ ప్రధాన ఎజెండాలో ఉన్న మూడు కీలక అంశాల్లో ఒకటి ‘ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code)’. మిగతా రెండింటిలో ఒకటి, అయోధ్యలో రామాలయ నిర్మాణం (Ayodhya ramalaya temple construction) కాగా, రెండవది జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు (Abrogation of article 370). బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడింటిలో.. అయోధ్యలో రామాలయ నిర్మాణం. జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు.. అనే రెండు కీలక డిమాండ్లను నెరవేర్చింది. ఇప్పుడు తాజాగా, అపరిష్కృతంగా ఉన్న మూడో డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. అకస్మాత్తుగా ఈ ‘ఉమ్మడి పౌర స్మృతి’ అంశం తెరపైకి రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది 2024 లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడం.
చట్టం చేయగలదా?
కాగా, ఈ ‘ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code)’ పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం చేయగలదా? చట్టం చేసేంత సంఖ్యాబలం ప్రభుత్వానికి ఉందా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. పార్లమెంటు ఉభయ సభల్లో లోక్ సభలో బీజేపీ కి సంపూర్ణ మెజారిటీ ఉంది. ‘ఉమ్మడి పౌర స్మృతి’ పై లోక్ సభలో బీజేపీకి, కేంద్రానికి ఎదురుండదు. లోక్ సభలో ఈ ‘ఉమ్మడి పౌర స్మృతి’ని విపక్షాలు వ్యతిరేకించగలవే కానీ, ఓడించలేవు. రాజ్యసభలోనే ప్రభుత్వానికి ఈ విషయంలో సమస్య ఎదురవుతుంది.
రాజ్యసభ లో పరిస్థితి..
రాజ్యసభ (Rajya Sabha) లో మొత్తం సభ్యుల సంఖ్య 245. కాగా, అందులో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే, ప్రస్తుత సభ్యుల సంఖ్య 237. మెజారిటీ మార్క్ 119. రాజ్యసభలో బీజేపీకి 92 మంది సభ్యులున్నారు. మిత్రపక్షం అన్నాడీఎంకేకు నలుగురు సభ్యులున్నారు. బీజేపీకి మద్దతిస్తున్న ఇతర చిన్న పార్టీలకు ఏడు సీట్లున్నాయి. ఇవన్నీ కలిపితే మద్దతిచ్చే సభ్యుల సంఖ్య 103కి చేరుతుంది. వీరికి ఒక స్వతంత్ర ఎంపీ, ఐదుగురు నామినేటెడ్ ఎంపీలన కూడా కలిపితే, వారి సంఖ్య 109 కి చేరుతుంది. అంటే, ఇప్పటికీ, మెజారిటీ మార్క్ అయిన 119 కి 10 మంది సభ్యులు తక్కువగానే ఉన్నారు. ఒకవేళ, అవసరానికి సహాయపడే నవీన్ పట్నాయక్ పార్టీ అయిన ఒడిశాకు చెందిన బీజేడీ కి ఉన్న 9 మంది సభ్యులు కూడా మద్దతిస్తే ఆ సంఖ్య 118 కి చేరుతుంది. ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్సీపీ ‘ఉమ్మడి పౌర స్మృతి’కి మద్దతు ఇవ్వబోవమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. బీజేపీని బద్ధ శత్రువుగా చూసే ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ‘ఉమ్మడి పౌర స్మృతి’ కి సూత్రప్రాయంగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆప్ కు ఢిల్లీ, పంజాబ్ ల్లో కలిసి 10 మంది సభ్యులున్నారు. ఆప్, బీజేడీలు మద్దతిస్తే బీజేపీ సునాయాసంగానే ‘ఉమ్మడి పౌర స్మృతి’పై తాను అనుకున్నది సాధించగలుగుతుంది.