Karnataka polls: కర్నాటకలో 20 ప్రాంతాల్లో ప్రధాని మోదీ ప్రచారం
20 April 2023, 19:09 IST
Karnataka polls: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 ప్రాంతాల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
PM Modi to campaign in Karnataka polls: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 ప్రాంతాల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కర్నాటక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించే బీజేపీ స్టార్ ప్రచార కర్తల జాబితాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్నాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యెడియూరప్ప, కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. మొత్తం 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రూపొందించారు.
PM Modi to campaign in Karnataka polls: 20 చోట్ల ప్రచారం..
కర్నాటకలో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించడానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై వెల్లడించారు. ప్రధాని ప్రచార కార్యక్రమం ఇంకా పూర్తిగా నిర్ణయం కాలేదని, అయితే, కనీసం 20 ప్రాంతాల్లో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ప్రధాని మోదీ బహిరంగ సభల్లో ప్రసంగించడం ద్వారా, రోడ్ షో ల ద్వారా ప్రచారం నిర్వహిస్తారని బస్వరాజ్ బొమ్మై తెలిపారు. ప్రధాని మోదీ ఏయే రోజుల్లో, ఏయే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారనే విషయంపై త్వరలో స్పష్టత వస్తుందని బొమ్మై వివరించారు. బీజేపీ స్టార్ ప్రచార కర్తల్లో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిస్వ శర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తదితరులు కూడా ఉన్నారు. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో మే 10వ తేదీన జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడ్తాయి.