Kashi-Telugu Sangamam: వారణాసిలో కాశి - తెలుగు సంగమం కార్యక్రమం; ప్రధాని ప్రసంగం
29 April 2023, 16:34 IST
Kashi-Telugu Sangamam: వారణాసిలో శనివారం సాయంత్రం కాశి - తెలుగు సంగమం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రసంగించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ
Kashi-Telugu Sangamam: వారణాసితో తెలుగు ప్రజల శతాబ్దాల అనుబంధాన్ని గుర్తుకు తెచ్చేలా కాశి - తెలుగు సంగమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొననున్నారు.
Kashi-Telugu Sangamam: మానస సరోవర్ ఘాట్ వద్ద..
ఈ కార్యక్రమం శనివారం వారణాసిలోని మానస సరోవర్ ఘాట్ వద్ద జరుగుతుంది. ప్రస్తుతం గంగ పుష్కరాలు కొనసాగుతున్నందున పెద్ధ ఎత్తున తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల నుంచి ప్రజలు వారణాసికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కాశి - తెలుగు సంగమం కార్యక్రమానికి వారు తరలివస్తారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలకు, వారణాసితో తరతరాలుగా ఉన్న సంబంధాలను వివరించనున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగ పుష్కరాలు ఏప్రిల్ 22 నుంచి 12 రోజుల పాటు జరుగుతాయి. ‘ కాశి - తెలుగు సంగమం కార్యక్రమాన్ని మానస సరవర్ ఘాట్ వద్ద నిర్వహిస్తున్నాం. వేలాదిగా తెలుగు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాశీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం’’ అని బీజేపీ రాజ్య సభ ఎంపీ, కాశీ తెలుగు సొసైటీ చైర్మన్ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల క్రితం జరిగిన పుష్కరాలకు వచ్చిన తెలుగు ప్రజలు ఇప్పుడు మళ్లీ వచ్చి, వారణాసిలో చోటు చేసుకున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన తెలిపారు. పవిత్ర వారణాసిలో చోటు చేసుకున్న అభివృద్ధికి అందరూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు.