తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ముంబై ఎయిర్ పోర్టులో విషాదం: వీల్ చైర్ అందక 1.5 కిమీ నడిచి ప్రయాణికుడు మృతి

ముంబై ఎయిర్ పోర్టులో విషాదం: వీల్ చైర్ అందక 1.5 కిమీ నడిచి ప్రయాణికుడు మృతి

HT Telugu Desk HT Telugu

16 February 2024, 14:45 IST

google News
  • Mumbai airport: ముంబై విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. సమయానికి వీల్ చైర్ లభించని కారణంగా విమానం నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు సుమారు 1.5 కిలోమీటర్లు నడిచిన ఒక 80 ఏళ్ల ప్రయాణికుడు విమానాశ్రయంలో కుప్పకూలి మృతి చెందాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్ నుంచి ఎయిరిండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు ముంబై విమానాశ్రయంలో దుర్మరణం చెందాడు. ఫిబ్రవరి 12న వీల్ చైర్ కొరత కారణంగా విమానం దిగిన తరువాత, విమానం వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు సుమారు 1.5 కిలోమీటర్లు నడిచిన ఆ 80 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలి చనిపోయాడు.

న్యూయార్క్ నుంచి వస్తుండగా..

ఆ ప్రయాణికుడు న్యూయార్క్ నుంచి ముంబైకి ఏఐ-116 విమానంలో తన భార్యతో కలిసి వచ్చాడు. ముంబై ఏర్ పోర్ట్ లో దిగగానే తమకు వీల్ చైర్ కావాలని వారు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే, వీల్ చైర్ల కొరత కారణంగా, ఆ దంపతుల్లో ఒకరికి మాత్రమే వీల్ చైర్ లభించింది. దాంతో, తన భార్య వీల్ చైర్ లో వెళ్తుండగా, తోడుగా ఆ వృద్ధుడు విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ కౌంటర్ వరకు, దాదాపు 1.5 కిమీల దూరం, నడిచి వెళ్లాడు. దాంతో, ఒక్కసారిగా అలసిపోయి, గుండె పోటుకు గురయ్యాడు. అక్కడే కుప్పకూలి చనిపోయాడు.

ఎయిర్ ఇండియా స్పందన

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. వీల్ చైర్లకు భారీగా డిమాండ్ ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించింది. ‘‘ఆ విమానంలో 32 మంది ప్రయాణికులు వీల్ చైర్ కావాలని ముందే బుక్ చేసుకున్నారు. కానీ 15 వీల్ చైర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి’’ అని వివరించింది. ఈ ఘటనపై ఫిబ్రవరి 16న ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. వీల్ చైర్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, వీల్ చైర్ సహాయం అందించే వరకు వేచి ఉండమని ఆ ప్రయాణికుడిని కోరామని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. అయితే, అతను తన జీవిత భాగస్వామితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు.

ఎయిర్ ఇండియా ప్రకటన

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. "ఫిబ్రవరి 12 న న్యూయార్క్ నుండి ముంబైకి విమానంలో వచ్చిన మా అతిథులలో ఒకరు వీల్ చైర్లో ఉన్న తన భార్యతో ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేయడానికి వెళుతుండగా అస్వస్థతకు గురయ్యారు. వీల్ చైర్ లకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, వీల్ చైర్ సహాయం అందించే వరకు వేచి ఉండమని మేము ఆ ప్రయాణికుడిని అభ్యర్థించాము. కాని అతను తన జీవిత భాగస్వామితో కలిసి నడవడానికి ఎంచుకున్నాడు. అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు విమానాశ్రయ వైద్యులు తెలిపారు’’ అని ఆ ప్రకటనలో వివరించారు.

తదుపరి వ్యాసం