Monsoon Session : సోమవారం నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. బీజేపీ వర్సెస్ విపక్షాలు!
17 July 2022, 15:36 IST
- Parliament Monsoon Session : సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్ట్ 12 వరకు ఉభయ సభల కార్యకలాపాలు సాగుతాయి. కాగా.. ఈ దఫా సమావేశాల్లో.. రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి.
సోమవారం నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఆగస్ట్ 12 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. దేశ సమస్యలపై బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బీజేపీ ముమ్మర కసరత్తులు చేసింది.
రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి ఎన్నికలు..
ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత కీలకంగా ఉండనున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆయా పదవుల్లో.. ఇవే వారికి చివరి పార్లమెంట్ సమావేశాలు.
కాగా.. సోమవారం పార్లమెంట్ సమావేశాలు మొదలైన వెంటనే.. రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎంపీలు.. పార్లమెంట్‌లోని పోలింగ్ బూత్‌లలో ఓట్లు వేయనున్నారు. ఈ నెల 21 కౌంటింగ్‌తో పాటు ఫలితాలు వెలువడనున్నాయి. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోల్చుకుంటే.. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే మద్దతు ఎక్కువగా ఉండటంతో.. ఆమె ఎన్నిక లాంఛనమే!
మరోవైపు ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ కూడా.. ఎన్డీఏ అభ్యర్థి జగ్దీప్ ధన్‌ఖడ్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
Parliament session 2022 : ఈ ప్రక్రియలు కొనసాగుతుండగా.. ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. మొత్తం మీద 24 కొత్త బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. వీటితో పాటు ఇప్పటికే 8 బిల్లులు పార్లమెంట్లో పెండింగ్‌లో ఉన్నాయి.
కేంద్రం ప్రవేశపెట్టనున్న 24బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతేకాకుండా.. పార్లమెంట్లో పాటించాల్సిన కొత్త రూల్స్‌ను కూడా ప్రకటించింది కేంద్రం. పార్లమెంట్ ఆవరణలో నిరసనలను నిషేధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీజేపీ వర్సెస్ విపక్షాలు..
ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశంలోని అనేక సమస్యలను ప్రస్తావించి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు విపక్షాలు సిద్ధపడుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, అగ్నిపత్ పథకం, నిరుద్యోగం, రూపాయి పతనం వంటి అంశాలు ఉభయ సభలను కుదిపేసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా మతపరమైన ఘర్షణలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంపై ప్రధాని మోదీని నుంచి సమాధానం అడగాలని విపక్షాలు భావిస్తున్నాయి.
Parliament news today : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాలు ఇప్పటికే సమావేశాలు జరిపాయి. కాంగ్రెస్ ఎంపీలు సైతం గురువారం భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.
విపక్షాల బాణాలను అడ్డుకునేందుకు బీజేపీ సైతం సన్నద్ధమైంది. ఈ మేరకు ఎంపీలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి.. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
అఖిలపక్ష సమావేశం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీతో పాటు వివిధ పార్టీల ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనకపోవడంతో విపక్షాలు తమ అసహనాన్ని వ్యక్తం చేశాయి.
All party meeting today : కాగా.. శ్రీలంక సంక్షోభంపై ఈ మంగళవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్‌లు.. శ్రీలంక సంక్షోభంపై ప్రకటన చేస్తారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం.. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.