Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్
02 May 2024, 14:46 IST
Parents sue Serum Institute: కొరోనా టైమ్ లో మొదట అందుబాటులోకి వచ్చిన వ్యాక్సీన్ కోవిషీల్డ్. కోవిడ్ 19 ను నిరోధించడానికి భారత్ లో చాలామంది ఆ టీకానే తీసుకున్నారు. అయితే, కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పై నాటి నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కోవిషీల్డ్ టీకాతో దారుణమైన దుష్పరిమాణాలు
వ్యాక్సిన్ తయారీదారు ఆస్ట్రాజెనెకా తన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ వల్ల ‘థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ -టీటీఎస్ (Thrombosis with Thrombocytopenia Syndrome TTS)’ వచ్చే అవకాశముందని ఇటీవల అంగీకరించింది. అయితే, అది అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే జరుగుతుందని తెలిపింది. ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క భారతీయ వేరియంట్ కోవిషీల్డ్. తమ వ్యాక్సిన్ 'టీటీఎస్' అనే అరుదైన దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని ఆస్ట్రాజెనెకా ఇటీవల అంగీకరించింది. ఆస్ట్రాజెనికా ఈ విషయాన్ని అంగీకరించిన కొన్ని రోజుల తరువాత, భారత దేశంలో కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేసిన పూణేకు చెందిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పై ఒక యువతి తల్లిదండ్రులు కోర్టులో కేసు వేశారు. కోవిషీల్డ్ టీకాను తీసుకోవడం వల్లనే తమ కూతురు మరణించిందని వారు ఆరోపిస్తున్నారు.
వ్యాక్సీన్ తోనే చనిపోయింది..
అయితే, ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు వారి కూతురు కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సీన్ కారణంగానే చనిపోయిందనడానికి ఆధారలు లేవని కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తేల్చింది. కారుణ్య 2021 జూలైలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించింది. అయితే, ఆమె మరణానికి వ్యాక్సిన్తో ముడిపెట్టడానికి ఆధారాలు సరిపోవని ఆ కమిటీ తేల్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో బాధితురాలి తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ నష్టపరిహారం కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేయాలని, తన కుమార్తె మృతిపై విచారణ జరిపేందుకు స్వతంత్ర మెడికల్ బోర్డును నియమించాలని కోరారు. ఆస్ట్రాజెనెకా చాలా ఆలస్యంగా తప్పును ఒప్పుకుందని, కోవిషీల్డ్ టీకా వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గోవిందన్ ఆరోపించారు. సైడ్ ఎఫెక్ట్స్ పై సమాచారం రాగానే, ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్స్టిట్యూట్ రెండూ వ్యాక్సిన్ తయారీ, సరఫరాను నిలిపివేయాల్సిందని ఆయన అన్నారు. ప్రస్తుత కేసు నుంచి తగిన పరిష్కారం లభించకపోతే మరిన్ని కేసులు పెడతామని గోవిందన్ హెచ్చరించారు. న్యాయం కోసం తమ పిల్లల మరణాలకు కారణమైన వారిపై కొత్తగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు.