Aggressive lions in national emblem : ``ఒరిజినల్ లానే నాలుగు సింహాలు``!
12 July 2022, 22:25 IST
Aggressive lions in national emblem : నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నంపై వివాదం రాజుకుంటోంది. సారనాథ క్షేత్రంలో ఉన్న స్థూపంలోని సింహాల వలె, యథాతథంగా ఈ విగ్రహాన్ని రూపొందించలేదని, ఈ సింహాలు రౌద్రంగా, గర్జిస్తున్నట్లుగా రూపొందించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నం
Aggressive lions in national emblem : నూతన పార్లమెంటు భవనాన్ని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీనిపై 21.3 అడుగుల ఎత్తుతో, 9.5 టన్నుల కాంస్యంతో ఒక భారీ జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే, అది భారత జాతీయ చిహ్నాన్ని సరిగ్గా ప్రతిబింబించడం లేదని, ఒరిజినల్ రూపానికి భిన్నంగా.. రౌద్రంగా దీన్ని రూపొందించారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు కావాలనే ప్రభుత్వం ఈ పని చేసిందని విమర్శిస్తున్నాయి.
Aggressive lions in national emblem : ఏ మార్పు చేయలేదు
ఈ ఆరోపణలపై ఆ నాలుగు సింహాల స్థూపాన్ని రూపొందించిన శిల్పి సునీల్ దేవ్‌డే స్పందించారు. ఈ నిర్మాణంలో తనపై ఎవరు ఒత్తిడి చేయలేదని, మార్పుచేర్పులు సూచించలేదని స్పష్టం చేశారు. ఒరిజినల్ శిల్పాన్ని పూర్తిగా అధ్యయనం చేశామని, వివిధ కోణాల్లో ఫొటోలు తీసుకుని, బ్లూప్రింట్ రూపొందించుకున్నామని వివరించారు. సారనాథ్ క్షేత్రంలోని ఒరిజినల్ శిల్పానికి ఇది పూర్తిస్థాయిలో ప్రతిరూపంగా ఉండేలా రూపొందించామని తెలిపారు.
Aggressive lions in national emblem : ఇది భారీ స్థూపం
సారనాథ్ క్షేత్రంలోని స్థూపంతో పోలిస్తే.. ఇది చాలా భారీ శిల్పమని సునీల్ వివరించారు. అయితే, ఆ స్థూపంలాగానే కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సారనాథ్‌లోని శిల్పం ఎత్తు 3 నుంచి మూడున్నర అడుగులు మాత్రమేనని, కానీ, పార్లమెంటు భవనం కోసం తాము రూపొందించినది 21.3 అడుగుల ఎత్తు ఉందని, అలాగే, దీని బరువు 9.5 టన్నులని వివరించారు.
ఫొటోలో తేడా ఎందుకు?
భారీ సైజ్ కారణంగా, ఫొటోల్లో ఒరిజినల్‌తో పోలిస్తే కొంత భిన్నంగా కనిపిస్తోందని వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫొటోలు విగ్రహం కింది భాగం నుంచి తీయడం వల్ల సింహాల నోరు పెద్దగా, గర్జిస్తున్నట్లుగా, రౌద్రంగా కనిపిస్తున్నాయని వివరించారు. అలాగే, వేరువేరు కోణాల్లో ఆ ఫొటోలు తీయడం వల్ల ఎక్స్‌ప్రెషన్స్‌లో తేడా కనిపిస్తోందన్నారు. నోరు పెద్దగా, గర్జిస్తున్నట్లుగా కనిపించడానికి కూడా అదే కారణమన్నారు.
Aggressive lions in national emblem : టాటా ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టును తనకు ప్రభుత్వం నేరుగా రాలేదని సునీల్ దేవ్‌డా వెల్లడించారు. ఈ కాంట్రాక్ట్‌ను తనకు టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఇచ్చిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి తన బృందానికి 9 నెలల సమయం పట్టిందన్నారు. మొత్తం నిర్మాణాన్ని వివిధ భాగాలుగా రూపొందించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ జాతీయ చిహ్నాన్ని సోమవారం ఆవిష్కరించారు.