Canada super visa | మీ పిల్లలు కెనడాలో ఉంటే.. మీరు లక్కీ!
07 July 2022, 20:47 IST
Canada super visa |`సూపర్ వీసా` నిబంధనల్లో పలు సంస్కరణలకు కెనడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కెనడాలో పీఆర్‌తో లేదా సిటిజన్‌షిప్‌తో ఉంటున్నవారి తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్‌కు ఇచ్చే సూపర్ వీసాకు సంబంధించి శుభవార్తను తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
కెనడా ప్రభుత్వం ఇచ్చే `సూపర్ వీసా`తో ఇకపై కెనడా పర్మినెంట్ రెసిడెంట్స్, కెనడా పౌరసత్వం ఉన్నవాళ్లు తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ వరుసగా ఐదేళ్ల పాటు కెనడాలో ఉండవచ్చు. ఈ కాల వ్యవధిలో ఎలాంటి వీసా రెన్యూవల్ అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ కాలపరిమితి రెండేళ్లు మాత్రమే ఉంది.
ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ
జులై 6 నుంచి `ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రా` కార్యక్రమాన్ని కెనడా పునః ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వ్యక్తులు వివిధ ప్రొగ్రామ్స్ కింద కెనడాలో శాశ్వత నివాస హక్కు(పర్మనెంట్ రెసిడెన్సీ) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రొగ్రామ్స్‌ను 1) ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రొగ్రామ్, 2) ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్ ప్రొగ్రామ్, 3) కెనడియన్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్`లుగా విభజించారు.
Canada super visa | మల్టిపుల్ ఎంట్రీ
కెనడా పౌరులు, కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్నవారు ఇకపై తమ తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతలను `సూపర్ వీసా` ప్రొగ్రామ్ కింద వరుసగా ఐదేళ్ల పాటు తమ వద్ద ఉంచుకోవచ్చు. ఇప్పటికే ఈ వీసాపై కెనడాలో ఉంటున్నవారు కూడా అ ప్రొగ్రామ్‌కు అర్హులే. అంటే, వారు అదనంగా మరో ఐదేళ్లు వీసా రెన్యువల్ లేకుండా కెనడాలో ఉండొచ్చు. ఈ సమయంలో ఎలాంటి వీసా రెన్యువల్ అవసరం లేదు. పదేళ్ల కాలపరిమితి ఉన్న ఈ సూపర్ వీసా ద్వారా మల్టిపుల్ ఎంట్రీ అవకాశం ఉంటుంది.
Canada super visa | ఇన్సురెన్స్ కూడా
ఈ సూపర్ వీసా దారులకు మెడికల్ ఇన్సురెన్స్ కూడా కల్పించాలనే ఆలోచనలో కెనడా ప్రభుత్వం ఉందని ఆ దేశ ఇమిగ్రేషన్ మినిస్టర్ సీన్ ఫ్రేజర్ వెల్లడించారు. సూపర్ వీసాను లాటరీ సిస్టమ్ ద్వారా కాకుండా, రెగ్యలర్ ప్రాసెస్‌లో ఇస్తారు. అందువల్ల ఈ వీసా లభించడం దాదాపు కచ్చితమే. గతంలో ఉన్న పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రామ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ సూపర్ వీసాను తీసుకువచ్చారు.