Nobel Peace Prize 2023: ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి
06 October 2023, 17:42 IST
Nobel Peace Prize 2023: 2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ని ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీ (Narges Mohammadi) కి లభించింది.
ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీ
Nobel Peace Prize 2023: ఇరాన్ లో మానవ హక్కుల కోసం, అందరికీ సమానమైన స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళా కార్యకర్త నర్గీస్ మొహమ్మదీ (Narges Mohammadi) ని ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం స్టాక్ హోం లోని స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
31 ఏళ్లు జైళ్లోనే..
చాంధసవాద సంప్రదాయాలతో కనీస మానవ హక్కులకు, స్వేచ్ఛకు దూరమైన మహిళల తరఫున ఇరాన్ లో నర్గీస్ మొహమ్మదీ పోరాడుుతున్నారు. ఈ పోరాటంలో ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. రాజ్యాన్ని ఎదిరించినందుకు ఆమె జైలు పాలు కూడా అయ్యారు. వ్యక్తిగతంగా ఎన్నో కోల్పోయి కూడా ఎంతో సాహసోపేతంగా, ధైర్యంగా ఆమె ఈ పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ పోరాటంలో ఆమె 13 సార్లు అరెస్ట్ అయ్యారు. 5 సార్లు దోషిగా నిర్ధారించబడ్డారు. ఆమె తన జీవిత కాలంలో దాదాపు 31 సంవత్సరాలు జైళ్లోనే గడిపారు. మొత్తంగా ఆ వీరనారిపై 154 కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా ఆమె జైళ్లోనే ఉన్నారు. సాధారణంగా సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు సమాన హక్కులు, మహిళా హక్కులు, ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం.. తదితర రంగాల్లో కృషి చేస్తున్నవారికి నోబెల్ కమిటీ శాంతి బహుమతికి ఎంపిక చేస్తుంది. అధికారంలో ఉన్నవారు చేసే తప్పులను విమర్శించడం, ప్రాథమిక హక్కులను కాపాడడం కోసం కృషి చేయడం, యుద్ధ నేరాలను వ్యతిరేకిస్తూ అలుపెరగని పోరాటం చేయడం వంటి మార్గాల్లో సమాజ సేవ చేస్తున్న వారిని నోబల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేస్తామని నోబెల్ అకాడమీ వెల్లడించింది.
2022 లో..
2022 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి బెలారస్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ఆలెస్ బియలాయట్స్కీ, రష్యా మానవహక్కుల సంస్థ ‘‘మెమొరియల్’’, ఉక్రెయిన్ మానవహక్కుల సంస్థ ‘‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’’ లకు సంయుక్తంగా లభించింది. ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎకనమిక్స్, శాంతి.. రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తారు.