తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mp Urination Incident: మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ అడిగిన మధ్య ప్రదేశ్ సీఎం

MP Urination Incident: మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ అడిగిన మధ్య ప్రదేశ్ సీఎం

HT Telugu Desk HT Telugu

06 July 2023, 14:45 IST

google News
  • MP Urination Incident: పేద గిరిజనుడి ముఖంపై ప్రవేశ్ శుక్లా అనే ఒక వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ బాధితుడి కాళ్లు కడిగి, క్షమాపణ అడిగారు.

మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడుగుతున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడుగుతున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడుగుతున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

MP Urination Incident: పేద గిరిజనుడైన దశరథ్ రావత్ ముఖంపై ప్రవేశ్ శుక్లా అనే ఒక వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) ఆ బాధితుడి కాళ్లు కడిగి, క్షమాపణ అడిగారు. ప్రవేశ్ శుక్లాను అత్యంత కఠినంగా శిక్షించాలని సీఎం చౌహాన్ ఇప్పటికే ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడిన మానవ మృగం ప్రవేశ్ శుక్లా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

వీడియో తీస్తున్నా భయపడలేదు..

మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక షాప్ లో మొబైల్ రీచార్జ్ కోసం వచ్చిన దశరథ్ రావత్ అనే గిరిజనుడు, షాప్ బిజీగా ఉండడంతో బయట కూర్చుని వెయిట్ చేస్తున్నాడు. ఫుల్ గా మద్యం పట్టించి, సిగరెట్ తాగుతూ అటువైపు వచ్చిన ప్రవేశ్ శుక్లా దశరథ్ రావత్ ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. అక్కడి వారు, ఆ షాపు అతను వద్దని చెప్పినా వినకుండా, ఆ దారుణానికి పాల్పడ్డాడు. వీడియో తీస్తున్నామని బెదిరించినా పట్టించుకోలేదు. దాంతో, ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు, ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కాళ్లు కడిగి క్షమాపణ అడిగిన సీఎం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినాతికఠినమైన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. దాంతో, అతడిపై పోలీసులు ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లతో పాటు జాతీయ భద్రత చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. దాంతో పాటు, గురువారం బాధితుడైన దశరథ్ ను భోపాల్ లోని తన అధికారిక నివాసానికి పిలిపించుకున్న సీఎం చౌహాన్.. అతడిని కుర్చీలో కూర్చోబెట్టి, తాను కింద కూర్చుని, పళ్లెంలో అతడి కాళ్లు పెట్టి, ఆ కాళ్లను కడిగి, జరిగిన తప్పుకు క్షమాపణ అడిగారు. తాను ప్రజా సేవకుడినని, ప్రజలు తనకు దేవుళ్లతో సమానమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం