Urinating on tribal man's face: పేద గిరిజనుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్
05 July 2023, 11:44 IST
Urinating on tribal man's face: మద్యం మత్తులో అమాయక, పేద గిరిజనుడి ముఖంపై మూత్ర విసర్జన చేసి అమానుషంగా ప్రవర్తించిన రాక్షసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని సిధి జిల్లాలో జరిగింది. దోషిని అత్యంత కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.
పోలీసుల అదుపులో నిందితుడు (బ్లాక్ టీ షర్ట్ లో ఉన్న వ్యక్తి)
మద్యం మత్తులో అమాయక, పేద గిరిజనుడి ముఖంపై మూత్ర విసర్జన చేసి అమానుషంగా ప్రవర్తించిన రాక్షసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని సిధి జిల్లాలో జరిగింది. దోషిని అత్యంత కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.
అసహ్యించుకుంటున్న ప్రజలు
ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మద్యం మత్తులో, మదమెక్కిన తీరులో రాత్రి సమయంలో, ఫుట్ పాత్ పై ఒంటరిగా కూర్చుని ఉన్నసమీప గిరిజన గ్రామం కరౌండికి చెందిన పేద గిరిజనుడు దస్మత్ రావత్ ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని సిధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో విస్తృతంగా వైరల్ అయింది. మూత్రవిసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అతడి అమానవీయ, అమానుష ప్రవర్తనపై అసహ్యం వ్యక్తం చేస్తూ, అతడిని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరుతోంది.
ముఖ్యమంత్రి స్పందన
ఈ ఘటన పై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినాతికఠినంగా శిక్షించాలని పోలీసులు ఆదేశించారు. అలాంటి అమానవీయ చర్యలకు పాల్పడేవారికి ఒక గుణపాఠంలా ఆ శిక్ష ఉండాలని ఆదేశించారు. ‘అతడిని వదిలిపెట్టం. అలాంటి వాడు మనిషి కాడు. దోషులకు మతం, మంచితనం, కులం, పార్టీ.. వంటివేవీ ఉండవు. దోషిని దోషిగానే చూస్తాం’ అని స్పష్టం చేశారు.
జాతీయ భద్రత చట్టం కింద కేసు
ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఐపీసీలోని 294, 504 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లతో పాటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల అనంతరం కఠినమైన జాతీయ భద్రత చట్టం (NSA) కింద కూడా కేసు నమోదు చేశారు.