Cyber Attacks : భారత వెబ్‌సైట్లపై సైబర్ దాడులు
13 June 2022, 7:04 IST
- ప్రవక్తపై బేజేపీ నాయకురాలి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భారత వెబ్‌సైట్లను హ్యాకర్లు లక్ష్యంగా మార్చుకున్నారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యల అల్‌ఖైదా వంటి ఉగ్ర సంస్థలు కూడా భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించాయి. నుపూర్ శర్మను బీజేపీ నుంచి సస్పెండ్ చేసినా ఆమె వ్యాఖ్యలు రాజేసిన మంటలు చల్లారలేదు. తాజాగా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు పెరిగాయి.
బీజేపీ నాయకుల వ్యాఖ‌్యల నేపథ్యంలో భారత్ వెబ్‌సైట్లు సైబర్ దాడులకు గురవుతున్నాయి
బీజేపీ నాయకుల వ్యాఖ్యల తర్వాత జరుగుతున్న పరిణమాల్లో భాగంగా భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్‌సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ ఫోర్స్ వరుస సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌టెన్షన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లపై సైబర్ దాడులు చేశారు. దాదాపు 70కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్‌సైట్లను డ్రాగన్‌ఫోర్స్ హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో హ్యాక్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన వెబ్‌సైట్లలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భవన్స్ వంటి ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి.
వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన తర్వాత అన్ని సైట్లలో ఒకే తరహా మెసేజీలను ఉంచారు. నీకు నీ మతం... మాకు మా మతం అంటూ సందేశాలను వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. దీంతో పాటు భారత్‌కు వ్యతిరేకంగాప్రచారం చేయాలంటూ ముస్లిం సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, యాక్టివిస్టులకు హ్యాకర్లు పిలుపునిచ్చారు. ఆదివారం నాటికి ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయలంలోని వెబ్‌సైట్‌ను అధికారులు పునరుద్ధరించారు.
ఐసిఏఆర్‌కు చెందిన వెబ్‌సైట్‌ను మాత్రం ఇంకా పునరుద్ధరించలేకపోయారు. ఈ తరహా దాడులతో వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్ వెబ్‌సైట్లపై దాడులు చేసినపుడు ఆ దేశానికి చెందిన పౌరుల వ్యక్తిగత సమాచారం, విపిఎన్ వివరాలు,పాస్‌పోర్ట్ వివరాలను హ్యాకర్లు లీక్ చేసినట్లు చెబుతున్నారు. వెబ్‌సైట్ల నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవడమే పరిష్కారమని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
టాపిక్