తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Moody's Gdp Growth Forecast: ఇండియా జీడీపీ అంచనాల్లో మూడీస్ కోత

Moody's GDP growth forecast: ఇండియా జీడీపీ అంచనాల్లో మూడీస్ కోత

01 September 2022, 10:41 IST

    • Moody's GDP growth forecast: పెరుగుతున్న వడ్డీ రేట్లు, రుతుపవనాల ద్వారా కురిసిన వర్షపాతంలో అసమానతలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో మందగమనం భారత దేశపు ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతాయని మూడీస్ సంస్థ పేర్కొంది.
హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న అపార్ట్‌మెంట్లు
హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న అపార్ట్‌మెంట్లు (AP)

హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న అపార్ట్‌మెంట్లు

Moody's GDP growth forecast: 2021లో 8.3 శాతంగా ఉన్న ఇండియా జీడీపీ వృద్ధి రేటు 2022లో 7.7 శాతంగా ఉంటుందని, 2023లో అది మరింత తగ్గి 5.2 శాతంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా వేసింది.

మార్చి నెలలో మూడీస్ భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 8.8 శాతం మేర వృద్ధి సాధిస్తుందని తన అంచనాలను ప్రకటించింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 13.5 శాతం వృద్ధి కనబడినప్పటికీ, రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్ధి మందగిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అత్యధిక వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మందగమనం దేశీయ ఆర్ధిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని విశ్లేషించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్క్ రెపో రేటును 140 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. గత నెలలో కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచింది.

వడ్డీ రేట్ల పెరుగుదల, నైరుతి రుతుపవనాల విస్తరణలో అసమానతలు, ప్రపంచ ఆర్థిక మందగమనం ఇండియా ఆర్థిక వృద్ధిపై వరుసగా ప్రభావం చూపుతాయని మూడీస్ విశ్లేషించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ద్రవ్యోల్భణం ఇంకా సవాలుగానే నిలుస్తోంది. వృద్ధిని, ద్రవ్యోల్భణాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. మరోవైపు యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 7 శాతం తగ్గిందని, దీని ప్రభావాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంటుందని మూడీస్ విశ్లేషించింది.

జూలై మాసంలో ద్రవ్యోల్భణం స్వల్పంగా తగ్గి 6.7 శాతానికి చేరింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట సహన శీలత పరిధి అయిన 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. వరుసగా ఏడో నెలలోనూ 6 శాతం పైన ద్రవ్యోల్భణం నమోదైంది. 2023లోనూ ద్రవ్యోల్భణం అధిక స్థాయిల్లోనే ఉంటుందని, జనవరి-మార్చి కాలంలో 5.8 శాతంగా, ఏప్రిల్-మే కాలంలో 5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఆగస్టులో ఆర్‌బీఐ రెపో రేటును మూడోసారి 50 బేసిస్ పాయింట్ల మేర పెంచి 5.4 శాతానికి చేర్చింది. ఆర్‌బీఐ తన దూకుడును 2023 వరకు కొనసాగించే అవకాశం ఉంది.

అయితే గ్లోబల్ కమోడిటీ ధరలు వేగంగా తగ్గడం భారతదేశ వృద్ధికి గణనీయమైన మెరుగుదలని అందిస్తుందని మూడీస్ పేర్కొంది.