Monkeypox: `సెక్స్ పార్ట్‌నర్స్ సంఖ్య తగ్గించుకోండి`
29 July 2022, 18:06 IST
Monkeypox: మంకీపాక్స్ భయాందోళనల నేపథ్యంలో World Health Organization(WHO) కీలక సూచన చేసింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తమ శృంగార భాగస్వామ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
Monkeypox: మంకీపాక్స్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దాదాపు 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో WHO చీఫ్ టెడ్రోస్ కీలక ప్రకటన చేశారు.
Monkeypox: `పార్ట్‌నర్స్`ను తగ్గించుకోండి
మంకీపాక్స్ ముప్పును తగ్గించుకోవడానికి సెక్స్ పార్ట్‌నర్స్ సంఖ్యను తగ్గించుకోవాలని WHO చీఫ్ టెడ్రోస్ ఘెబ్రియేసస్ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా `సేమ్ సెక్స్` పార్ట్‌నర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. స్వలింగ సంపర్కులు ఎక్కువ సంఖ్యలో శృంగార భాగస్వామ్యులను కలిగి ఉంటే, ఈ వైరస్ సోకే ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా కొత్త పార్ట్‌నర్స్‌తో శృంగారాన్ని నిలిపివేయాలని సలహా ఇచ్చారు. కేవలం స్వలింగ సంపర్కులకే కాదు, ఈ వైరస్ ఎవరికైనా సోకుతుందని టెడ్రోస్ స్పష్టం చేశారు.
Monkeypox: వివక్ష వద్దు
మంకీపాక్స్ సాధారణ జబ్బేనని, అది సోకినవారిపై వివక్ష చూపకూడదని WHO చీఫ్ టెడ్రోస్ విజ్ఞప్తి చేశారు. వైరస్‌తో ముప్పు కన్నా ఈ వివక్ష వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. మంకీపాక్స్ ఈ సంవత్సరం మే నెలలో ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైంది. ఆయా దేశాల్లో ఈ సమస్య చాన్నాళ్లుగా ఉంది. కానీ, ఈ సంవత్సరం ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
Monkeypox: 78 దేశాల్లో..
ఇప్పటివరకు 78 దేశాలకు మంకీపాక్స్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా యూరోప్ దేశాల్లో దీని విస్తృతి అధికంగా ఉంది. దాదాపు 75% కేసులు యూరోప్ దేశాల్లోనే నమోదయ్యాయి. ఈ మంకీపాక్స్‌తో ఇప్పటివరకు ఐదుగురు చనిపోగా, 10% మంది మాత్రమే హాస్పిటలైజ్ అయ్యారు. స్వలింగ సంపర్కులైన పురుషుల్లో ఈ వ్యాధి అత్యధికంగా కనిపిస్తోందని ఒక అధ్యయనంలో తేలింది. అయితే, దీన్ని ఇప్పటివరకు సెక్స్ ద్వారా సోకే వ్యాధిగా నిర్ధారించలేదు. వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం ద్వారా ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంది.
Monkeypox: మాస్ వ్యాక్సినేషన్ అవసరం లేదు
మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మాస్ వ్యాక్సినేషన్ అవసరం లేదని WHO పేర్కొంది. వైద్య సిబ్బంది సహా ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి, వారిని వ్యాక్సినేట్ చేస్తే చాలని సూచించింది.