Mob lynch man in Pak: పోలీస్ స్టేషన్ ను ముట్టడించి.. నిందితుడిని కొట్టి చంపేశారు
11 February 2023, 20:55 IST
Mob lynch man in Pak: దైవ దూషణకు (blasphemy) పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రజలు కొట్టి చంపిన ఘటన పాకిస్తాన్ లో జరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
Mob lynch man in Pak: పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న నాంకనా సాహిబ్ పట్టణంలో పవిత్ర ఖురాన్ ను ధ్వంసం చేసి, అవమానపరిచాడనే (blasphemy) ఆరోపణలపై మొహమ్మద్ వారిస్ అనే వ్యక్తిపై స్థానికులు దాడి చేసి కొట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మొహమ్మద్ వారిస్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.
Mob lynch man in Pak: కొట్టి చంపేశారు..
అయితే, దైవ దూషణకు (blasphemy) పాల్పడ్డాడన్న ఆగ్రహంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ నుంచి వారిస్ ను తీవ్రంగా కొట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు. స్టేషన్ వెలుపల నిందితుడు మొహమ్మద్ వారిస్ ను రోడ్డుపై ఈడ్చుకెళ్తూ, దుస్తులు విప్పి తీవ్రంగా కొడుతూ దాడి చేశారు. ఆ దెబ్బలకు సుమారు 20 ఏళ్ల వయస్సున్న నిందితుడు వారిస్ చనిపోయాడు. అనంతరం అతడి మృతదేహాన్ని అక్కడే కాల్చివేయడానికి ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్ ను ప్రజలు పెద్ద ఎత్తున ముట్టడించిన సమయంలో స్టేషన్లో కొద్ది మందే పోలీసులు ఉన్నారని, అందువల్ల ఆగ్రహంతో ఉన్న గుంపును అడ్డుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చిన అదనపు బలగాలు అక్కడి గుంపును చెదరగొట్టి, వారిస్ మృతదేహాన్ని తగలపెట్టకుండా అడ్డుకున్నారు.
Mob lynch man in Pak: శ్రీలంక వ్యక్తిని కూడా..
మత ద్రోహం, దైవ దూషణల విషయంలో ప్రజలు హింసాత్మకంగా ప్రవర్తిస్తున ఘటనలు ఇటీవల పాకిస్తాన్ లో ఎక్కువయ్యాయి. 2021 లో శ్రీలంక కు చెందిన ఒక వ్యక్తిని దైవ దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొట్టి చంపారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో, ఈ నేరానికి పాల్పడినవారిలో ఆరుగురికి కోర్టు మరణశిక్ష విధించింది.
Mob lynch man in Pak: వీడియో వైరల్.. పీఎం సీరియస్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తిని కాళ్లు పట్టుకుని రోడ్డుపై లాక్కుని వెళ్లడం, దుస్తులను విప్పించి, కొట్టుకుంటూ తీసుకుని వెళ్లడం, కర్రలతో, ఇనుప చువ్వలతో కొడ్తుండడం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. పాకిస్తానీ చట్టాల ప్రకారం దైవ దూషణ, పవిత్ర గ్రంధాలను అవమానపర్చడం నేరం. ఈ నేరానికి మరణ శిక్ష సైతం విధించవచ్చు.