Minor girl raped: రైల్వే స్టేషన్‌లో మైనర్ బాలికపై ఇద్దరి రేప్
09 August 2022, 11:02 IST
- దేశ రాజధాని డిల్లీలో ప్రముఖ రైల్వే స్టేషన్ అయిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 17 ఏళ్ల బాలికపై వాటర్ బాటిల్స్ అమ్ముకునే ఇద్దరు వ్యక్తులు రేప్‌కు పాల్పడ్డారు (ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీ, ఆగస్టు 9: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో 17 ఏళ్ల బాలికను రేప్ చేసిన ఇద్దరు హాకర్ల(వీధి వ్యాపారులు) అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున తిలక్ బ్రిడ్జి సమీపంలో రైలు పట్టాల వెంబడి పొదల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిందితులను ఫరీదాబాద్‌కు చెందిన హర్దీప్ నగర్ (21), ఆగ్రాకు చెందిన రాహుల్ (20)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వాటర్ బాటిళ్లను అమ్మేవారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376డి కింద కేసు నమోదు చేశామని, నిందితులిద్దరినీ అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వేస్) హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.
గుజరాత్‌కు చెందిన బాలిక ఆదివారం నాడు తన స్నేహితుడైన దీపక్‌తో కలిసి గుజరాత్‌కు తిరిగి వెళ్లేందుకు ఎక్కేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరూ గొడవపడడంతో స్నేహితుడు ఆమెను స్టేషన్‌లో వదిలేసి వెళ్లిపోయాడు.
ఆ బాలిక సెంట్రల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఉండగా ఈ ఇద్దరు హాకర్లు ఆమెను కలిశారు. ఆమె తన సోదరుడికి కాల్ చేయడానికి వారి మొబైల్ ఫోన్ కోసం వారిని అభ్యర్థించింది.
రైలును అందుకోవడానికి సాయం చేయాలని ఆమె వారిని కోరినప్పుడు, వేరే స్టేషన్ నుండి రైలు అందుబాటులో ఉంటుందని చెప్పి తిలక్ బ్రిడ్జి సమీపంలోని ట్రాక్ వెంబడి ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.
‘ఆగస్టు 4న ఆమె దీపక్‌తో కలిసి దీపక్ సొంతూరికి వెళ్లడానికి ఇంటి నుండి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం రైలు ఎక్కి ఆగస్ట్ 6న లక్నో చేరుకుంది. అక్కడ నుండి వారు టాక్సీని అద్దెకు తీసుకొని దీపక్ గ్రామానికి చేరుకున్నారు. వారు అదే రాత్రి తిరిగి ఢిల్లీకి బయలుదేరారు. వారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి గుజరాత్‌కు వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది..’ అని డీసీపీ (రైల్వేస్) చెప్పారు.
‘వారు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. అక్కడ నుండి వారు రాత్రి 9:40 గంటలకు జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కవలసి ఉంది. కానీ వారు రైలు అందుకోలేకపోయారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీపక్ ఆమెను స్టేషన్‌లోనే వదిలిపెట్టాడు..’ అని పోలీసు అధికారి తెలిపారు.
ఫిర్యాదుదారు, నిందితులు ఇద్దరికీ వైద్య పరీక్షలు చేశారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని సందర్శించింది. ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
టాపిక్