25 kg of gold stolen: జోస్ అలుక్కాస్ నుంచి 25 కేజీల బంగారం దొంగతనం; ఒక్కడే తాపీగా షాపంతా కలియతిరిగి..
29 November 2023, 10:36 IST
- 25 kg of gold stolen: కోయంబత్తూరు లో ఒక బంగారు, వజ్రాల ఆభరణాల షో రూమ్ నుంచి 25 కేజీల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. ఒకే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో తేలింది.
షో రూమ్ లో మాస్క్ వేసుకుని ఉన్న దొంగ
25 kg of gold stolen: కోయంబత్తూరులోని గాంధీ పురంలో జోస్ అలుక్కాస్ అండ్ సన్స్ బంగారు, వజ్ర ఆభరణాల దుకాణం ఉంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ షో రూమ్ లోకి జొరబడిన వ్యక్తి తాపీగా షో రూమ్ అంతా, ఒక కస్టమర్ లా కలియతిరుగుతూ, నచ్చిన ఆభరణాలను తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ లో వేసుకున్నాడు.
ఏసీ డక్ట్ ద్వారా..
షో రూం వెనుక భాగంలోని ఏసీ డక్ట్ ఉన్న ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసి, లోపలికి వెళ్లిన, దొంగ అక్కడి ఫాల్స్ సీలింగ్ కు రంధ్రం చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని, చేతిలో ఒక పెద్ద బ్యాగ్ తో ఉన్న చిత్రాలు అక్కడి సీసీ టీవీ లో రికార్డు అయ్యాయి. షాపులోనికి వెళ్లిన తరువాత నాలుగు ఫ్లోర్లలో ఉన్న మొత్తం షో రూమ్ ను నెమ్మదిగా పరిశీలించి, తనకు నచ్చిన ఆభరణాలను బ్యాగ్ లో వేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన మార్గం నుంచే వెళ్లిపోయాడు. ముఖ్యంగా, 1, 2 అంతస్తుల్లో ఉన్న ఖరీదైన వజ్రాభరాలను ఎక్కువగా తీసుకువెళ్లాడు.
ఒక్కడే..
ఉదయం షో రూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. షో రూమ్ నుంచి దాదాపు 25 కేజీల బంగారం, వజ్రాల ఆభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోరూమ్ లో వేలి ముద్రలు, తదితర ఆధారాలను సేకరించిన పోలీసులు ఈ దొంగతనానికి పాల్పడింది ఒక్కడేనని ప్రాథమికంగా భావిస్తున్నారు. అతడికి ఎవరైనా సహకరించారా? అన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. గతంలో ఈ షాప్ లో పని చేసి ఉన్న వ్యక్తి కానీ, ఈ షో రూమ్ పూర్తి వివరాలు తెలిసి ఉన్న వ్యక్తి కానీ ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ఘరానా దొంగ కోసం గాలిస్తున్నారు.