Maharashtra politics live : ముదిరిన సంక్షోభం.. ఏక్‌నాథ్ వద్దకు 'శివ'సైనికులు క్యూ
23 June 2022, 20:35 IST
- Maharashtra politics live : మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు గంట గంటకు మద్దతు పెరుగుతోంది! ఫలితంగా మహారాష్ట్ర వ్యవహారంలో గురువారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.. మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తుంది.
తిరుగుబాటు ఎమ్మెల్యేలున్న హోటల్‌కు మేఘాలయ సీఎం
మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా గురువారం మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌కు రావడం సంచలనం సృష్టించింది. సంగ్మా గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు గురువారం మధ్యాహ్నం వచ్చారు. ఇది పలు అనుమానాలకు తావిచ్చింది. సంగ్మా పార్టీ ఎన్‌పీపీ(నేషనల్ పీపుల్స్ పార్టీ) బీజేపీకి మిత్రపక్షం.. ఎన్డీయేకు భాగస్వామ్య పక్షం. మేఘాలయలో బీజేపీ సంగ్మా పార్టీకి మద్దతిస్తోంది. బీజేపీ సీనియర్ నేతలతో కన్రాడ్ సంగ్మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయన అకస్మాత్తుగా తిరుగుబాటు ఎమ్మెల్యేలున్న హోటల్‌కు రావడం పలు అనుమానాలకు కారణమైంది. అయితే, తాను లంచ్ చేయడానికి వచ్చానని, ఈ హోటల్ గువాహటి విమానశ్రయం నుంచి షిల్లాంగ్ వెళ్లే మార్గంలో ఉందని సంగ్మా వివరణ ఇచ్చారు.
`ఉద్ధవ్ వెంటే మేం!`
సంక్షోభ కాలంలో మహారాష్ట్ర సీఎం, భాగస్వామ్య పక్షం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీలు తోడుగా నిలిచాయి. మహా వికాస్ అఘాడీ మనుగడ కోసం శివసేనకు మద్దతు కొనసాగిస్తామని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డెప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఉద్ధవ్ ఠాక్రేకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. మరోవైపు, కాంగ్రెస్ కూడా ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ప్రకటించింది. అవసరమైతే, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబై వచ్చి సీఎం ఠాక్రేను నేరుగా కోరితే, అధికార కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధమేనన్న శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించడానికి అజిత్ పవార్ నిరాకరించారు. తమ తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసం అలా అని ఉండవచ్చన్నారు.
ఒక జాతీయ పార్టీ సపోర్ట్
గువాహటి లోని ఒక హోటల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో.. ఒక జాతీయ పార్టీ మనకు సపోర్ట్‌గా ఉందని, ఎలాంటి సాయం అవసరమైనా చేస్తామని వారు చెప్పారని షిండే ఆ ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. మన నిర్ణయం చరిత్రాత్మకమైనదని ఆ జాతీయ పార్టీ అభివర్ణించిందని షిండే ఆ ఎమ్మెల్యేలకు వివరించారు.
యుద్ధ క్షేత్రంలో ఎవరేం చేయాలి?
మహారాష్ట్రలో శివసేన రాజకీయం ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో మోహరించిన రెండు సైన్యాల మాదిరిగా ఉంది. ఒకవైపు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సైన్యం, మరోవైపు, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సేన. ఉద్ధవ్ సైన్యానికి మద్దతుగా కాంగ్రెస్, ఎన్సీపీ పక్షాలు, షిండే సేనకు మద్దతుగా బీజేపీ ఉన్నాయి. ప్రస్తుతానికి షిండే సేననే విజయానికి అవసరమైన మేజిక్ మార్క్‌కు దగ్గరగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరేం చేయాలి..?
ఉద్ధవ్ సేన..
సొంత సైన్యాన్ని(ఎమ్మెల్యేలను, ఎంపీలను) కాపాడుకోవాలి. వైరి పక్షం(షిండే సేన) లో ఉన్న తన సైనికులను (ఎమ్మెల్యేలను) తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. వారితో సంప్రదింపులకు, వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించాలి. షిండేతో రాజీకి ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే, కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి. లేదా, శాసనసభలో బలపరీక్షకు సిద్ధం కావాలి. ఈ లోపు షిండే పక్షం నుంచి సాధ్యమైనంత మంది ఎమ్మెల్యేలను తిరిగి స్వపక్షంలోకి తెచ్చుకోవాలి. మిత్రపక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతును కాపాడుకోవాలి.
షిండే సేన
తిరుగుబాటు దళంలో ఉన్న సైనికులను(శివసేన ఎమ్మెల్యేలు), తిరిగి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఉద్ధవ్ సైన్యంలో ఉన్న సైనికుల్లో మరి కొందరిని ఆకర్షించాలి. తద్వారా గెలుపును కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇందుకు, బీజేపీ సేన పరోక్ష మద్దతు తీసుకోవాలి.
`అధికార కూటమి నుంచి వైదొలగుతాం!`
తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఒక ఆఫర్ ఇచ్చారు శివసేన నేత సంజయ్ రౌత్. గువాహటి నుంచి మాట్లాడడం కాకుండా, ముంబైకి తిరిగివచ్చి సీఎంతో మాట్లాడాలని సూచించారు. ``ఒకవేళ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోతే, అధికార కూటమి మహా వికాస్ అఘాడీ నుంచి వైదొలిగే విషయం కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. ఎమ్మెల్యేల అభిప్రాయాలకు సీఎం గౌరవం ఇస్తారు. అయితే, ముందుగా, వారు ముంబై వచ్చి సీఎంతో మాట్లాడాలి`` అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
ఉద్ధవ్ వైపు 13 మంది ఎమ్మెల్యేలే
ఒకవైపు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు పార్టీ ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతుండగా, మరోవైపు, ఉద్ధవ్ వర్గం కుంచించుకుపోతోంది. ఉద్ధవ్ ఠాక్రే గురువారం ఉదయం ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి కేవలం 12 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, తిరుగుబాటు బృందంలోని కనీసం 20మంది ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
షిండే క్యాంప్‌లో ఇప్పటివరకు 42
శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటివరకు షిండే క్యాంప్‌లో ఇండిపెండెంట్లు సహా 42 మంది ఎమ్మెల్యేలు చేరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా అనర్హత వేటు తప్పించుకోవాలంటే శివసేనకు చెందిన కనీసం 37 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఆ నెంబర్‌ను ఈజీగా చేరుకుంటామని షిండే వర్గం చెబుతోంది. అస్సాంలోని గువాహటిలో తనతో ఉన్న ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు `శివసేన జిందాబాద్`, `బాల్‌ఠాక్రే జిందాబాద్` అంటూ నినాదాలు చేశారు.
`కనీసం దగ్గరకు రానివ్వలేదు`
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల విమర్శలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నరేళ్లు తమకు సీఎం ఇంటి తలుపులు మూసే ఉన్నాయని, సీఎంను కలవాలంటే, వేరే పార్టీలకు చెందిన మధ్యవర్తుల సాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. ఈ రెండున్నరేళ్లలో అన్నిరకాలుగా శివసైనికులు నష్టపోయారన్నారు. ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవి నుంచి వైదొలగాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్, ఎన్సీపీల అసహజ కూటమి నుంచి వైదొలగి, సహజ భాగస్వామి అయిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్ధవ్‌కు ఎన్సీపీ మద్దతు
సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శివసేనకు, ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్సీపీ మద్దతుగా నిలిచింది. ఏం జరిగినా.. ఠాక్రే వెన్నంటె ఉంటామని ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ తేల్చిచెప్పారు.
బీజేపీ నేతల సమావేశం
ముంబైలోని మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ నివాసంలో బీజేపీ నేతల సమావేశం జరుగుతోంది. మహారాష్ట్రలోని తాజా పరిణామాలపై వారందరు చర్చిస్తున్నారు.
ఒక్క ఎమ్మెల్యే చాలు..!
ప్రస్తుత పరిస్థితులు ఉద్ధవ్ ఠాక్రేకు ప్రతికూలంగానే ఉన్నాయి. మరొక్క ఎమ్మెల్యే.. ఏక్‌నాథ్ షిండేతో చేరితే.. ఠాక్రే ఓటమి లాంఛనమైనట్టే! ఇంకొక్క ఎమ్మెల్యే వస్తే.. పార్టీని షిండే.. చీల్చిపడేయొచ్చు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాలు కూడా షిండేను ఏం చేయలేవు.
‘బీజేపీ పాత్ర లేదు..’
మహారాష్ట్ర సంక్షోభం.. శివసేన అంతర్గత విషయమని, ఇందులో బీజేపీ పాత్ర లేదని కేంద్రమంత్రి రావుసాహెబ్ పాటిల్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు.
సీఎంగా ఏక్‌నాథ్?
మహా వికాస్ అఘాడీలోని పార్టీల మధ్య బుధవారం చర్చలు జరిగాయి. ఇందులో ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ సైతం పాల్గొన్నారు. ఏక్‌నాథ్ షిండేను సీఎం చేయాలని అందరు భావించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సంక్షోభానికి ఇదొక్కటే పరిష్కారమని వారందరు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
కాగా.. బుధవారం రాత్రి వర్చువల్‌గా ప్రసంగించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. తనకు పదవుల పట్ల ఆసక్తి లేదని పునరుద్ఘాటించారు. అవసరమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
ఉద్ధవ్ వ్యాఖ్యలను ఏక్‌నాథ్ షిండే తిప్పికొట్టారు. అసహజ కూటమి నుంచి శివసేన బయటకు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లేకపోతే కష్టమని తేల్చిచెప్పారు.
మరో ముగ్గురు..
గౌహతీలో ఉన్న ఏక్‌నాథ్ షిండేకు మద్దతు పెరుగుతోంది. తాజాగా.. గురువారం ఉదయం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు.. గౌహతీకి వెళ్లి షిండే బృందంలో చేరిపోయారు!