Maha polls live blog: మహారాష్ట్ర, జార్ఖండ్ ల్లో బీజేపీ కూటమిదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్..
20 November 2024, 20:30 IST
మహారాష్ట్ర, జార్ఖండ్ ల్లో బీజేపీ కూటమిదే విజయమని పలు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, జార్ఖండ్ లో ఎన్డీఏ విజయం సాధిస్తాయని అంచనా వేశాయి. పూర్తి వివరాలు, పోలింగ్ విశేషాలను ఈ లైవ్ బ్లాగ్ లో చూడండి..
జార్ఖండ్ లో ‘ఇండియా’ కూటమి విజయం: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ సంస్థ యాక్సిస్ మై ఇండియా.. జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ కూటమికి 53, ఎన్డీయేకు 25, ఇతరులకు 3 స్థానాలు వస్తాయని తెలిపింది. పీ-మార్క్ కూడా ఎన్డీయే కూటమికి 37-47 సీట్లు, ఎన్డీయేకు 31-40 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జార్ఖండ్ లో మెజారిటీ మార్క్ 41 సీట్లు.
పోలింగ్ బూత్ లో గుండెపోటుతో ‘బీడ్’ ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి
మహారాష్ట్రలోని బీడ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బాలాసాహెబ్ షిండే.. పోలింగ్ బూత్ లో ఓటు వేయడానికి తన వంతు కోసం వేచి ఉండగా తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. షిండేను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బీడ్‌లోని ఛత్రపతి షాహూ విద్యాలయ ఓటింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటులో ఓటింగ్‌ను వాయిదా వేస్తారు.
15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు కూడా..
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు బుధవారం ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్ ల్లోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో 9 స్థానాలు యూపీలోనే ఉన్నాయి. ఈ సీట్లలో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. ఈరోజు ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 54% పోలింగ్ నమోదైంది.
మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ కూడా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ కూటమికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని, కాంగ్రెస్-శివసేన (యుబిటి)-ఎన్‌సిపి (ఎస్‌సిపి) కూటమి 110-130 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 137 నుండి 157 స్థానాల్లో గెలుస్తుందని తేల్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి 126 నుంచి 146 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
జార్ఖండ్ లో ఎన్డీఏ దే విజయం; పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ లో ఎన్డీఏదే విజయమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41 కాగా, బీజేపీ సొంతంగానే 42 నుండి 48 స్థానాలు గెల్చుకుంటుందని పేర్కొంది.
మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే విజయమన్న ఎగ్జిట్ పోల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) ల కూటమి మహాయుతి విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 288 సీట్లకు గానూ బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి 182 స్థానాలు వస్తాయని పేర్కొంది.
మహారాష్ట్రలోని మావోయిస్ట్ ప్రభావిత గడ్చిరోలిలో అత్యధిక శాతం పోలింగ్
మహారాష్ట్రలో మధ్యాహ్నం 3 గంటల వరకు 45.53% ఓటింగ్ నమోదైంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గడ్చిరోలిలో అత్యధికంగా 62.99%, పోలింగ్ నమోదు కావడం విశేషం. థానేలో అత్యల్పంగా 38.94% ఓటింగ్ నమోదైంది. ముంబై నగరంలో 39.34% ఓటింగ్ నమోదు కాగా, ముంబై సబర్బన్‌లో 40.89% నమోదైంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీల వారీగా పోటీ చేస్తున్న స్థానాల సంఖ్య
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో బీజేపీ 149, శివసేన 81, అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101, శివసేన (యూబీటీ) 95, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 86 మంది అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీఎస్పీ, ఎంఐఎం సహా చిన్న పార్టీలు కూడా బరిలోకి దిగగా, బీఎస్పీ 237, ఎంఐఎం 17 మంది అభ్యర్థులను బరిలోకి దింపాయి.
ఓటేసేందుకు వచ్చిన శ్రద్ధా కపూర్ తో పోలింగ్ సిబ్బంది సెల్ఫీలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నటి శ్రద్ధా కపూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్త్రీ 2 సినిమా సక్సెస్ తో పాపులర్ అయిన శ్రద్ధాకపూర్ తో సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడున్న ఓటర్లతో పాటు పోలింగ్ స్టేషన్ సిబ్బంది కూడా ఉత్సాహపడ్డారు.