తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Governer:చరిత్రలోనే తొలిసారి.. 2 నిమిషాల్లో పాలసీ స్పీచ్ ను ముగించిన గవర్నర్; అసెంబ్లీని అవమానించడమేనన్న పార్టీలు

Kerala governer:చరిత్రలోనే తొలిసారి.. 2 నిమిషాల్లో పాలసీ స్పీచ్ ను ముగించిన గవర్నర్; అసెంబ్లీని అవమానించడమేనన్న పార్టీలు

HT Telugu Desk HT Telugu

25 January 2024, 13:07 IST

google News
  • Kerala governer: కేరళ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ కు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఇచ్చే పాలసీ ప్రసంగాన్ని గవర్నర్ తూతూమంత్రంగా రెండు నిమిషాల్లో ముగించారు. ఇది అసెంబ్లీని అవమానించడమేనని సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్

Kerala governer: కేరళ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గురువారం నుంచి ప్రారంభమవుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తన విధాన ప్రసంగంలోని చివరి పేరాను మాత్రమే చదివి, రెండు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.

షేక్ హ్యాండ్ కూడా లేదు..

ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ ఖాన్ కు ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్ ఏఎన్ షంషీర్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అయితే, గవర్నర్ ముఖ్యమంత్రితో కరచాలనం చేయలేదు. కనీసం పలకరించలేదు. జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం గవర్నర్ ఖాన్ లేచి పాలసీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘గౌరవనీయ స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత, సభ్యులు, 15వ కేరళ శాసనసభ 10వ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని కేరళ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ ఖాన్.. ఆ తరువాత 61 పేజీల విధాన ప్రసంగం ప్రతిని కనీసం చూడకుండానే, చివరి పేరాకు వెళ్లిపోయారు. చివరి పేరా అయిన ‘‘మన గొప్ప వారసత్వం భవనాల్లోనో లేదా స్మారక చిహ్నాలలో లేదని, భారత రాజ్యాంగం యొక్క అమూల్యమైన వారసత్వం మరియు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయాల కాలాతీత విలువలకు మనం చూపించే గౌరవంలో ఉందని గుర్తుంచుకోవాలి. సహకార సమాఖ్య విధానం మన దేశాన్ని ఇన్నాళ్లూ ఐక్యంగా, బలంగా ఉంచింది. ఈ సారం నీరుగారిపోకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఈ వైవిధ్యమైన, అందమైన దేశంలో భాగంగా, అన్ని సవాళ్లను అధిగమిస్తూ సమ్మిళిత వృద్ధితో బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా కొనసాగుతాం’’ అని చదివి ప్రసంగాన్ని ముగించారు.

చరిత్రలోనే మొదటిసారి..

ఇలా రెండు నిమిషాల్లోపే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తరువాత జాతీయ గీతాలాపన జరిగింది. అనంతరం, ఆయన ఉదయం 9.04 గంటలకు స్పీకర్ తో గానీ, ముఖ్యమంత్రితో గానీ మాట్లాడకుండా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ చరిత్రలో ఒక గవర్నర్ అతి తక్కువ సమయం ప్రసంగించడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.

అసెంబ్లీకి అవమానం

గవర్నర్ తీరుపై ప్రభుత్వ, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ మాట్లాడుతూ గవర్నర్ చర్య అసెంబ్లీని పూర్తిగా అగౌరవపరిచేలా ఉందన్నారు. ‘‘గవర్నర్ శాసన ప్రక్రియలను, రాజ్యాంగ ఆదేశాలను ధిక్కరించి వ్యవహరించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య జరిగిన రాజకీయ డ్రామాకు ఇది విషాదకరమైన ముగింపు’’ అని వ్యాఖ్యానించారు. గవర్నర్ కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని, అందువల్లనే ఆయన అలా ప్రవర్తించారేమోనని రాష్ట్ర మంత్రి సాజీ చెరియన్ వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం