తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cauvery Water Dispute: ‘తమిళనాడుకు కనీసం 3 వేల క్యూసెక్కుల కావేరి జలాలనైనా ఇవ్వండి’- కర్నాటకకు విజ్ఞప్తి

Cauvery water dispute: ‘తమిళనాడుకు కనీసం 3 వేల క్యూసెక్కుల కావేరి జలాలనైనా ఇవ్వండి’- కర్నాటకకు విజ్ఞప్తి

HT Telugu Desk HT Telugu

27 September 2023, 11:45 IST

google News
  • Cauvery water dispute: కావేరి నదీ జలాల పంపకానికి సంబంధించి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడానికి కర్నాటక నిరాకరిస్తోంది. ఈ విషయంలో కావేరి జలాల నియంత్రణ కమిటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కాదంటోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cauvery water dispute: కావేరి నదీ జలాల పంపకానికి సంబంధించి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాదంపై కావేరి వాటర్ రెగ్యులేషన్ కమిటీ (CWRC) మరోసారి స్పందించింది. తమిళనాడు తాగు, సాగు నీటి అవసరాల కోసం సెప్టెంబర్ 28 నుంచి 18 రోజుల పాటు కనీసం 3 వేల క్యూసెక్కుల నీటినైనా విడుదల చేయాలని కర్నాటకను ఆదేశించింది.

రెండు రాష్ట్రాల్లోనూ ఉద్రిక్తత

కావేరి నదీ జలాల పంపకానికి సంబంధించి తమిళనాడు, కర్నాటకల్లో ప్రజలు, రైతులు ఆందోళన బాట పట్టారు. కావేరి నీటిని వెంటనే విడుదల చేయాలని తమిళనాడు రైతులు, కావేరి నీటిని విడుదల చేయకూడదని కర్నాటక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కర్నాటకలో మంగళవారం బంద్ నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోనూ పోటాపోటీగా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రుల దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు నిర్వహించారు.

3 వేల క్యూసెక్కులైనా..

ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన కావేరి వాటర్ రెగ్యులేషన్ కమిటీ (CWRC) మరోసారి కర్నాటకకు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు తాగు, సాగు నీటి అవసరాల కోసం సెప్టెంబర్ 28 నుంచి 18 రోజుల పాటు కనీసం 3 వేల క్యూసెక్కుల నీటినైనా విడుదల చేయాలని కర్నాటకను కోరింది. తమిళనాడు మొదట 24 వేల క్యూసెక్కుల నీరు కావాలని మొదట కోరింది. ఆ తరువాత ఆ మొత్తాన్ని 10 వేల క్యూసెక్కులకు తగ్గించింది. ఆ తరువాత, కనిష్టంగా 5 వేల క్యూసెక్కులైనా రాష్ట్రానికి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. కానీ, చివరకు 3 వేల క్యూసెక్కులను కిందకు విడుదల చేయాలని కావేరి వాటర్ రెగ్యులేషన్ కమిటీ (CWRC) కర్నాటకను ఆదేశించింది.

లోటు వర్షపాతం..

గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం మిగులు వర్షపాతం నమోదు కావడంతో, కావేరీ జలాలను దిగువకు విడుదల చేయడంలో ఎలాంటి సమస్య ఎదురు కాలేదని, కానీ, ఈ సంవత్సరం లోటు వర్షపాతం నమోదైనందున, తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని కర్నాటక వాదిస్తోంది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రిజర్వాయర్లలోకి 53% తక్కువ వరద నీరు వచ్చిందని చెబుతోంది. రాష్ట్రంలోని 161 తాలూకాల్లో తీవ్రమైన కరువు, 34 తాలూకాల్లో సాధారణ కరువు నెలకొన్నదని వివరిస్తోంది. ఈ తాలూకాల్లో దాదాపు మూడొంతుల తాలూకాలు కావేరి రివర్ బేసిన్ లో ఉన్నాయని తెలిపింది. అందువల్ల తమిళనాడుకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని వాదిస్తోంది.

తదుపరి వ్యాసం