Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే గురించి అమెరికా, రష్యా అధ్యక్షులు మాట్లాడుకున్నారు: సంజయ్ రౌత్ స్పీచ్ వైరల్
29 December 2022, 8:39 IST
- Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే గురించి అమెరికా, రష్యా అధ్యక్షులు బైడెన్, పుతిన్‍తో పాటు బ్రిటన్ రాజు చార్లెస్ ఆరా తీశారని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈ స్పీచ్ ప్రస్తుతం వైరల్‍గా మారింది. ఆయన ఈ కామెంట్లు ఎందుకు చేశారంటే..!
ఉద్ధవ్ ఠాక్రే
Sanjay Raut Viral Speech: శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ఓ ప్రసంగం వైరల్‍గా మారింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఎవరంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir putin), బ్రిటన్ కింగ్ చార్లెస్ చర్చించుకున్నారని రౌత్ అన్నారు. ఏక్‍నాథ్ షిండే ప్రభుత్వంపై ఉద్ధవ్ ఎలా పోరాడుతున్నారో ఓ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ వారు చర్చించుకుంటున్నారని చెప్పారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‍స్కీ కూడా ఉద్ధవ్ గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు. అయితే సంజయ్ రౌత్ (Sanjay Raut) ఈ వ్యాఖ్యలు వ్యంగంగా చేసినట్టు తెలుస్తోంది. అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడారు.. దీనికి బీజేపీ ఎలా స్పందించిందో ఇక్కడ చూడండి.
సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కారణమిదే..!
Shiv Sena Leader Sanjay Raut Viral Speech: “రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇంగ్లండ్ మహారాజు చార్లెస్.. ఉద్ధవ్ ఠాక్రే ఎవరు అని కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ప్రభుత్వంపై ఎలా పోరాడుతున్నారని ఆశ్చర్యపోయారు. అసలు ఎవరు ఆయన అని ఆరా తీస్తున్నారు. తమకు ఉద్ధవ్‍ను ప్రధాని మోదీ ఎందుకు పరిచయం చేయలేదని వారు ఆశ్చర్యపోతున్నారు” అని సంజయ్ రౌత్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. అయితే, తన గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరా తీశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే ఇటీవల వ్యాఖ్యానించారు. దీనికి వ్యంగంగానే సంజయ్ రౌత్ ఈ తాజా ప్రసంగం చేసినట్టు తెలుస్తోంది.
కపిల్ శర్మ షోకు పోటీ
సంజయ్ రౌత్ స్పీచ్‍పై బీజేపీ నాయకులు కొందరు స్పందించారు. కపిల్ శర్మ షోకు సీరియన్ పోటీ వచ్చింది” అని బీజేపీ నేత ప్రీతీ గాంధీ ట్వీట్ చేశారు. “ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యాక, ఆయన ప్రమాణ స్వీకారానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వస్తారని సంజయ్ రౌత్ చెబుతున్నారు. రాహుల్ గాంధీ, సంజయ్ రౌత్‍ల్లో ఎవరికి హాస్య చతురత ఎక్కువగా ఉంది” అని సమీత్ థక్కర్ ట్వీట్ చేశారు.
శివసేన పార్టీ ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చి బీజేపీ మద్దతుతో ఏక్‍నాథ్ షిండే.. ఈ ఏడాదిలోనే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి కోల్పోయారు. ఇప్పుడు శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది.
Maharashtra - Karnataka border: మరోవైపు ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు యుద్ధం నడుస్తోంది. బెళగావి జిల్లాలోని కొన్ని గ్రామాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతోంది. ఒక్క ఇంచును కూడా వదలబోమని కర్ణాటక అంటుంటే, మరాఠీ మాట్లాడే ప్రజలు ఉండే గ్రామాలను కలుపుకుంటామని మహారాష్ట్ర చెబుతోంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉండడం గమనించాల్సిన విషయం.